CM KCR Bihar tour: గల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బిహార్ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న ఆయన.. తొలుత ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్.. నేరుగా బిహార్ సీఎం నీతీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్‌కు నీతీశ్‌తో పాటు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘనస్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న బిహార్ సీఎం అనంతరం నీతీశ్‌తో కలిసి ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరుల కుటుంబాలకు నీతీశ్‌తో కలిసి చెక్కులు అందించారు. దీంతో పాటు కొద్దినెలల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకూ రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమం అనంతరం బిహార్ సీఎం ఆహ్వానం మేరకు కేసీఆర్ మధ్యాహ్న భోజన విందులో పాల్గొన్నారు.
అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిది: సీఎం కేసీఆర్ "దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వెలకట్టలేనిది. ప్రతి ఒక్క భారతీయుడు.. సైనికులకు అండగా ఉంటాడు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనా సమయంలో వలస కార్మికుల కోసం రైళ్లు ఏర్పాటు చేశాం. తెలంగాణ అభివృద్ధిలో బిహార్ వలస కార్మికులు భాగస్వాములు. వలస కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. బిహార్‌లో చేపట్టే మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను." -సీఎం కేసీఆర్
బిహార్ సీఎం, డిప్యూటి సీఎంతో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఆ ఆలోచన చాలా గొప్పది..గల్వాన్ ఘటనలో అమరులైన జవాన్లకు, హైదరాబాద్ ఘటనలో చనిపోయిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని కొనియాడారు. కరోనా సమయంలో వలస కార్మికులను ఆదుకున్నారని.. వారి పట్ల కేసీఆర్ చూపిన శ్రద్ధ మరువలేనిదని ప్రశంసించారు. రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవడం మంచి సంకేతమని బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు.
ఆర్థికసాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: నీతీశ్ "తెలంగాణ ఏర్పాటు కోసం 2001 నుంచి కేసీఆర్ పోరాడారు. ఆయన కృషి, పట్టుదల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఉద్యమ నాయకుడే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో సాగుతోంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించారు. రెండు నదుల నీళ్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. బిహార్‌లోనూ గంగా జలాన్ని అన్నిచోట్లకు అందించేందుకు కృషి చేస్తున్నాం. జలవిధానాలు పరిశీలించేందుకు త్వరతోనే అధికారులను తెలంగాణకు పంపుతాం." -నితీశ్‌కుమార్, బిహార్ సీఎం
ఇవీ చదవండి: