మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజలు బయటకి వెళ్లకూడదని ప్రకటించిన అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేయిస్తున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రసాయనాలు చల్లారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలైన కూరగాయాల మార్కెట్లు, సూపర్మార్కెట్ల ఆవరణల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. మల్కాజిగిరిలోని రోడ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయల వద్ద ద్రావణాన్ని చల్లారు. మలక్‌పేట్‌లోనూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు అగ్నిమాపకశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వైరస్ కట్టడికి ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్‌ను వెదజల్లారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ సహా.. నగరంలోని పెట్రోల్ బంకులు, కళాశాలల్లోనూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లారు. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. బోధన్‌లోనూ వైరస్ నివారణకు అగ్నిమాపక అధికారులు చర్యలు చేపట్టారు. బాన్సువాడలోని ప్రధాన కూడళ్ల వద్ద రసాయనాన్ని వెదజల్లారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని సర్పంచులు .. ట్రాక్టర్‌కు యంత్రాన్ని అమర్చి గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు.