CBN FIRES ON POLICE ‘ఆడబిడ్డలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నారు గాంధీజీ. జగన్ పాలనలో మగవాళ్లు మధ్యాహ్నం 12 గంటలకు కూడా బయట తిరగలేకపోతున్నారు. ఏపీలోని కుప్పంలో 82 రోజులుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్న రవిచంద్రపై వైకాపా గూండాల దాడే ఇందుకు నిదర్శనం’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కూతవేటు దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్ ఎదుటే దాడి జరుగుతుంటే పోలీసులకు కనపడలేదా? ఆంధ్రప్రదేశ్‌లో అసలు పోలీసు వ్యవస్థ ఉందా? పోలీసులు ఉన్నది తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలను కొట్టడానికేనా? అని నిలదీశారు. మీ ఇల్లు ధ్వంసం చేస్తే, మీ కుటుంబసభ్యులను నడిరోడ్డులో అవమానిస్తే ఆ బాధ మీకు తెలుస్తుంది.. ఎన్టీఆర్ సాక్షిగా అన్న క్యాంటీన్‌పై దాడి చేస్తే మా కార్యకర్తలకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు. కుప్పం చరిత్రలో ఇదో చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘రవిచంద్రపై దాడి చేసిన వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సింది పోయి.. వాళ్ల (వైకాపా ఎమ్మెల్సీ భరత్) ఇంటికి తీసుకెళ్తారా? మగాళ్లయితే.. ధైర్యముంటే వైకాపా రౌడీలు ఇప్పుడు రండి.. అధికార పార్టీ చోటామోటా నాయకులు, పుంగనూరు రౌడీ పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, తమ్ముడు, డీజీపీ, సలహాదారులు అంతా కలిసి కుప్పం రండి.. పోలీసులు కాసేపు పక్కన ఉంటే ఎంతమంది వైకాపా గూండాలు వస్తారో చూస్తా. వారి కథ రెండు నిమిషాల్లో తేలుస్తా’ అని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రెండోరోజు గురువారం చంద్రబాబు కుప్పంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించే ముందు.. వైకాపా శ్రేణులు అక్కడున్న బ్యానర్లను చించేశారు. క్యాంటీన్ నిర్వహణ చూస్తున్న రవిచంద్రపై దాడి చేశారు. దీంతో చంద్రబాబు అన్న క్యాంటీన్ వద్దకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ప్రసంగించారు.
ఖబడ్దార్ జగన్‌రెడ్డీ..‘తెలుగుదేశం పార్టీ.. రౌడీలు, గుండాలు, తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసింది. నా ప్రజాజీవితంలో ఎంతో మంది నాయకులను చూశా. నీలాంటి చరిత్రహీనులను మాత్రం చూడలేదు. పోలీసు వ్యవస్థే ఉంటే ఈ రోజు అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసేవారా? మిస్టర్ ఎస్పీ కుప్పంలోనే ఉన్నావా? లేదా? ఉంటే నువ్వే కొట్టించావా? ఇప్పుడు నేను కావాలంటే మీ (ఎమ్మెల్సీ భరత్) ఇంటిని కొట్టలేనా? ఆ ఇంటిపై పడటానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఖబడ్దార్ జగన్‌రెడ్డీ. ఈ రోజు కుప్పంలోనే కాదు. ఏపీ మొత్తం తిరుగుబాటు మొదలయింది. చట్టాన్ని అమలు చేయకపోతే పోలీసులను ప్రజల ముందు దోషులుగా నిలబెడతా. ఈ పోలీసుల్లో కొందరు కీలుబొమ్మలు. వీళ్లను ఆడించేది జగన్మోహన్రెడ్డి. న్యాయం కోసం పోరాడేవారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెదేపా కార్యకర్త లక్ష్మీపురం రాజు రక్తంతో తడిచిన తెదేపా జెండాను ప్రజలకు చూపుతూ.. ఈ పోలీసులది రక్తదాహం అంటూ మండిపడ్డారు.