ఆంధ్రప్రదేశ్ మాఫియా రాజ్యంగా(ChandraBabu about Drug Mafia)మారిపోయిందని.. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను చెప్పే పరిస్థితి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. లేసుల ఎగుమతులకు ప్రసిద్ధి పొందిన నర్సాపురం నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు పంపించే పరిస్థితి తలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిందును కలిసిన అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు.
"మద్యనిషేధమని చెప్పి మూడు, నాలుగు రెట్లు ధరలు పెంచి సొంత బ్రాండ్లతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ మద్యం కంటే గంజాయి, హెరాయిన్ తక్కువ రేటుకు వస్తుండటంతో అందులో వాటిని కలుపుకొంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఒక మాఫియా తయారైంది. దీన్ని ప్రశ్నించినందుకు మా పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు విశాఖపట్నం, నెల్లూరు కార్యాలయాలపై దాడులు చేశారు. పట్టాభి ఇంటిని ధ్వంసం చేశారు. కాళహస్తి, హిందూపురం, అనంతపురం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు. నేను డీజీపీకి ఫోన్ చేస్తే ఎత్తరు. సీఎం, డీజీపీ ఇద్దరూ కలిసి మా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి జరగడం చరిత్రలో మొదటిసారి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై దాడి చేసి ఆయన్ను ఇంటికి పంపించే వరకు ఒత్తిడి తెచ్చారు." అని చంద్రబాబు అన్నారు.