కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ బరోకా నేతృత్వంలోని కేంద్ర బృందం ఈ సాయంత్రం బీఆర్కే భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్లో కొవిడ్ 19 వైరస్ పరిస్థితి, సంబంధిత అంశాలపై సమీక్షించింది.
సమగ్ర వ్యూహం
కొవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందానికి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. కరోనా నివారణ కోసం అన్ని శాఖలు ఒక టీమ్ లాగా సమగ్ర వ్యూహం రూపొందించామని తెలిపారు. కరోనా బాధితులకు అందించే చికిత్స, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ, క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రుల సన్నద్ధత, పర్యవేక్షణ, నమూనా పరీక్షలు, హెల్ప్ లైన్, వైద్య ఉపకరణాల సమీకరణ, పేదలకు బియ్యం, నగదు పంపిణీ, వలస కూలీలకు అందిస్తోన్న సాయం, అన్నపూర్ణ కేంద్రాలు, షెల్టర్ హోమ్స్ గురించి సోమేశ్ కుమార్ వివరించారు.