Kishan Reddy on Bandi Sanjay Arrest : భాజపా నేతలను కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులతో వేధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కొవిడ్ నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు భాజపా భవనానికి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన భాజపా కార్యాలయంపై పోలీసులు దాడి చేశారని నిలదీశారు.
ఇందుకోసమే ఉద్యమం చేశామా?
BJP on Bandi Sanjay Arrest : అక్రమ కేసులకు భాజపా భయపడదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 'ధర్నాచౌక్‌లో సీఎం ఆందోళన చేయవచ్చు.. ప్రతిపక్షాలు చేయకూడదా?' అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత అణచివేత లేదని అన్నారు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా? అని అడిగారు. దిల్లీలో ఏడాదిపాటు రైతులు ఉద్యమం చేసినా కేంద్రం అడ్డుకోలేదన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.
బండి సంజయ్‌కు కిషన్ రెడ్డి పరామర్శ..
Kishan Reddy Met Bandi Sanjay in Jail : అంతకుముందు.. కరీంనగర్ జైలులో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే ఈటలతో కలిసి కరీంనగర్‌కు వెళ్లారు. అనంతరం సంజయ్ కార్యాలయాన్ని పరిశీలించారు. జాగరణ దీక్ష అరెస్ట్ సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరును శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. సంజయ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
కేసీఆర్ సమాధానం చెప్పాలి..
'బదిలీల జీవో 317 ను సవరించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతున్నాయి. మద్దతు తెలపాలని వారు మమ్మల్ని కోరారు. అందుకే భాజపా తరఫున బండి సంజయ్ జాగరణ పేరుతో దీక్ష చేపట్టారు. కరోనా నిబంధనలతోనే దీక్ష ప్రారంభించారు. కానీ పోలీసుల అడ్డంకితో అంతా గందరగోళంగా మారింది. ఇది భాజపా కార్యాలయం.. ఈ భవనానికి సీఎం కేసీఆర్ కిరాయి కట్టడం లేదు. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ భవనం నడవడం లేదు. ఓ ఎంపీ కార్యాలయంపై పోలీసుల దాష్టీకం ఏంటో అర్థం కావడం లేదు. ఈ అమర్యాదపూర్వక ఘటనకు కేసీఆర్ సమాధానం చెప్పాలి.' - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి