తెలంగాణ

telangana

ETV Bharat / city

మార్పు మాతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు : కిషన్ రెడ్డి - kishan reddy campaign for ghmc elections

ఇప్పటివరకు హైదరాబాద్‌ ప్రజలు మజ్లిస్‌, తెదేపా, కాంగ్రెస్‌, తెరాస పాలన చూశారు. నిజాయతీయే మా మార్గం. అభివృద్ధి మా లక్ష్యం. ఎవరెవరికో అధికారం ఇచ్చారు.ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నాం. మాకు అధికారమిస్తే నిజమైన భాగ్యనగరాన్ని నిర్మిస్తాం.హైదరాబాద్‌లో రూ. 67,000 కోట్లు ఖర్చుచేసి కూడా అసెంబ్లీ, రాజ్‌భవన్‌ ముందు వరదనీళ్లు ఆగకుండా చేయలేకపోయారు. మంచి రహదారులు, ప్రజలకు ఇళ్లు వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమేది? ఇదేనా అభివృద్ధి? పేదల వరద సాయాన్ని గులాబీ దండు తన్నుకుపోయింది.- కిషన్‌రెడ్డి

central-minister-kishan-reddy-
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By

Published : Nov 25, 2020, 6:44 AM IST

‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అది భాజపా ద్వారానే సాధ్యమన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నికతో తొలి అడుగు పడింది.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండో అడుగేసేందుకు జనం సిద్ధమవుతున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి కేంద్రంపై యుద్ధం అంటూ తెరాస చౌకబారు ప్రకటనలు చేయడం సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం..’’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్‌ ప్రజలు ఈసారి అవకాశం ఇస్తే భాజపా అసలైన అభివృద్ధి చేసి చూపిస్తుందని ‘ఈనాడు-ఈటీవీభారత్​’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా లక్ష్యం ఏంటి?

హైదరాబాద్‌ మేయర్‌ పీఠం కైవసం చేసుకోవడమే మా లక్ష్యం. కనీసం 90 సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాం.

స్థానిక ఎన్నికలకు జాతీయ స్థాయిలో కీలకనేత భూపేంద్ర యాదవ్‌ సహా ఐదుగురు ఇంఛార్జీలను రంగంలోకి దింపడానికి ప్రత్యేక కారణాలున్నాయా?

స్థానిక సమరమే అయినప్పటికీ.. రాష్ట్ర రాజధాని ప్రాంతం.. నాలుగు జిల్లాల పరిధి.. 5 లోక్‌సభ స్థానాలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 74 లక్షలమంది ఓటర్లు పాల్గొనే కీలక ఎన్నిక ఇది.. ఈ కారణాలతోనే గ్రేటర్‌ ఎన్నికలకు జాతీయ నాయకత్వం ప్రాధాన్యమిస్తోంది. నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అయ్యాక తెలంగాణలో యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచీ భాజపాకు మద్దతు పెరుగుతోంది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లోనూ భాజపా జెండా ఎగరేయాలన్నది మా లక్ష్యం.

కర్ణాటక, గుజరాత్‌కు పెద్దఎత్తున వరదసాయం అందిందని.. హైదరాబాద్‌కు పైసా అందలేదన్న విమర్శలపై ఏమంటారు?

తెలంగాణలో పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఇవ్వలేదు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో వరదలతో నష్టపోయినవారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్వయంగా కలిసి నష్టపరిహారమిచ్చారు. ఇక్కడ సీఎం కేసీఆర్‌ వరద బాధితుల్ని పరామర్శించారా? వరద సాయాన్ని గులాబీ దండు తన్నుకుపోయింది.

హైదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని గతంలో మీరు అన్నారు కదా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని చాలావరకు తగ్గించగలిగాం. టెక్నాలజీ వాడుకుంటున్నాం. ఉగ్రవాద సంస్థలకు విదేశాల నుంచి నిధులు అందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ఉగ్రవాదం తగ్గుముఖం పడుతోంది.

గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపాకే ఎందుకు ఓటేయాలో చెబుతారా..

హైదరాబాద్‌లో కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలే రాజ్యమేలుతున్నాయి. ఈ రెండింటి ఆధిపత్యం అంతం కావాలంటే భాజపాకు ఓటేయాలని ప్రజల్ని కోరుతున్నా.

మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని.. దేశ రాజకీయాల్లో తెరాస కీలకపాత్ర పోషించబోతుందని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు కదా?

కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం చేస్తానంటున్నరు.. ఆ వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారా? తెరాస అధినేతగానా? అన్నది స్పష్టంచేయాలి. యుద్ధం పాకిస్థాన్‌తో చేస్తారు.. సరిహద్దుల్లో ఇతర దేశాలతో యద్ధం అవుతుంది, దేశం లోపల జరగదు.. తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తే మంచిది. కేంద్రంపై యుద్ధం చేయడమేంటో వివరిస్తే బాగుంటది.

ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం సాధ్యమని భాజపా భావిస్తోందా..

మా తొలి ప్రాధాన్యం యువతే. ఆ తర్వాతే ఇతర పార్టీల్లోని మంచి నేతలపై దృష్టిపెడుతున్నాం. భాజపాలో చేరుతున్నవారిలో 90 శాతం మంది యువతే. యువశక్తే దుబ్బాకలో భాజపాను గెలిపించింది.

రాజకీయలబ్ధికి భాజపా మతాన్ని రాజకీయం చేస్తుందన్న విమర్శలపై ఏమంటారు?

15 నిమిషాలు సమయమిస్తే 100 కోట్లమంది హిందువుల సంగతి చూస్తానన్న మజ్లిస్‌తో తెరాస పొత్తు పెట్టుకుంది. భాజపాను విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీకి ఎక్కడిది? భాజపా 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎక్కడైనా మతకలహాలు జరిగాయా? కర్ఫ్యూలు పెట్టారా? భాజపాకు తండ్రి, కొడుకుల సర్టిఫికెట్‌ అక్కరలేదు. దేశప్రజలు కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారమిచ్చారు.

హైదరాబాద్‌లో మజ్లిస్‌తో ఢీ అంటూ.. ఇతర రాష్ట్రాల్లో భాజపా ఇందుకు భిన్నంగా వెళుతోంది. బిహార్‌లో పోటీ చేయాలని ఒవైసీని అమిత్‌షా అడిగారంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై ఏమంటారు?

మజ్లిస్‌తో మాకెలాంటి రాజకీయ సంబంధాల్లేవు. బిహార్‌లో పోటీ చేయమని ఒవైసీకి అమిత్‌షా చెప్పలేదు. వాళ్లు ఇతర రాష్ట్రాల్లో పోటీచేయడం వల్ల మాకొచ్చే లాభంలేదు. రాజకీయ లబ్ధి కోసమే కేజ్రీవాల్‌ వంటి ముఖ్యమంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 67,000 కోట్లు ఖర్చుచేశాం.. మేం చేసినవి వంద పనులు చెబుతాం.. కేంద్రం ఒక్క పనిచేసిందా? అని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. మీరేమంటారు?

హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సింది గ్రేటర్‌ పాలకమండలే. అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే.. ఇక జీహెచ్‌ఎంసీ ఎందుకు? ఎన్నికలు నిర్వహించడమెందుకు? హైదరాబాద్‌లో రూ. 67,000 కోట్లు ఖర్చుచేశామంటూ గులాబీ గ్రాఫిక్స్‌తో ప్రజల్ని మభ్యపెట్టలేరు. వేల కోట్లు ఖర్చుచేస్తే అభివృద్ధి కనిపించాలి కదా? తెరాస పుణ్యమా అని విశ్వనగరం కాస్త మొన్నటి వర్షాలకు విషాద నగరంగా మారింది. హైదరాబాద్‌ ఎంత సురక్షితమో.. రోజుకెన్ని కిడ్నాపులు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు.

కేంద్ర నిధులపై కేటీఆర్‌ది అవగాహన రాహిత్యం, వేర్పాటువాద భావజాలంతో మాట్లాడుతున్నారు. ఇలాంటి చర్చ దేశ సమైక్యతకు మంచిదికాదు. కేంద్రానికి వచ్చేది ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము కాదు. ఈ ఆదాయంలో సింహభాగాన్ని కేంద్ర ప్రభుత్వం.. దేశ రక్షణకు, రైల్వేలు, అంతర్గత భద్రతకు ఖర్చు చేస్తుంది. కేంద్రం ఏటా రూ.30 లక్షల కోట్లు దేశం మొత్తంలో ఖర్చు పెడుతోంది. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం బియ్యం, వంటగ్యాస్‌, ఎరువుల సబ్సిడీ, గ్రామాలు, పట్టణాలకు.. జాతీయ రహదారులకు.. రూ.లక్షల కోట్లు ఇస్తోంది.. తెలంగాణలో పేదలకు ఇచ్చే ప్రతి కిలో బియ్యంలో మోదీ ప్రభుత్వం రూ.30 భరిస్తోంది. కేంద్రం డబ్బులతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల గురించి తెరాస ప్రభుత్వం రోజూ డబ్బా కొట్టుకుంటోంది. హైదరాబాద్‌లో రక్షణ, పరిశోధన సంస్థలు అనేకం ఉన్నాయి. ఆ కేంద్రాల ఖర్చు, వారికి జీతాలు కేంద్రమే భరిస్తుంది కదా?

‘‘తెలంగాణ ఆదాయంలో 80 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఆదాయాన్ని ఆదిలాబాద్‌లోనో, మరో జిల్లాలోనో ఎందుకు ఖర్చుపెడుతున్నారని ఇక్కడి యువత ప్రశ్నిస్తే ఏం చెబుతారు? మీ చేతికిస్తేనే, కల్వకుంట్ల ఖాతాలో వేస్తేనే కేంద్రం నిధులు ఇచ్చినట్టా? మొత్తం ఆదాయం రాష్ట్రాలకిస్తే దేశ సరిహద్దులను కాపాడేందుకు డబ్బు ఎవరివ్వాలి? దేశ సరిహద్దుల్లో, శాంతిభద్రతల పరిరక్షణ, మతకలహాల కట్టడిలో దేశవ్యాప్తంగా పనిచేసే 11 లక్షలమంది సీఆర్‌పీఎఫ్‌ పోలీసులకు జీతాలు ఎవరిస్తారు?’’

- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, జి.కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details