Kishan Reddy Comments on CM KCR: రాష్ట్రంలో భాజపా బలపడుతుండటం చూసి.. సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అభద్రతా భావంతోనే వ్యవస్థలపై దుమ్మెత్తిపోస్తున్నారని దిల్లీలోని భాజపా కార్యాలయంలో ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్‌పై నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్న కేంద్ర మంత్రి .. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
"నీతిఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవటం సరైన నిర్ణయం కాదు. కేసీఆర్ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు, సమాఖ్య స్ఫూర్తికి మంచిది కాదు. దేశానికి, రాష్ట్రానికి అవసరమైన అంశాలపై చర్చించేందుకు నీతిఆయోగ్ అత్యున్నత వేదిక. రాజకీయ దురుద్ధేశాలతో రాజ్యాంగ సంస్థలను తప్పుపట్టకూడదు. కేసీఆర్‌కు ప్రధానిని కలవటం ఇష్టం లేకపోతే వెళ్లకుండా ఉండొచ్చు. కానీ.. నీతి ఆయోగ్‌ను తప్పుపట్టడం సరికాదు. కడుపునొప్పి వచ్చిందని తల నరుక్కున్నట్లుగా కేసీఆర్ విధానం ఉంది. తెలంగాణలో భాజపా బలపడిన తర్వాత తమ కుటుంబం నుంచి అధికారం చేజారిపోతుందేమోనని ఆవేదన, అభద్రత భావంతో.. ప్రధాని మోదీ, భాజపాపైనా విష ప్రచారం చేస్తున్నారు." - కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి