ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం(Central Government) తేల్చిచెప్పింది. వచ్చే మూడు నాలుగేళ్లకు సరిపడా నిల్వలున్నాయని.. 2021-22లో ఏ రాష్ట్రం నుంచి కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం కొనుగోలు చేయబోమని పునరుధ్ఘాటించింది. ఈ విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేకంగా తెలిపింది. ఈ ప్రభావం రెండు రాష్ట్రాలపై ఉన్నప్పటికీ ప్రస్తుతానికి తెలంగాణపైన తీవ్రంగా ఉండనుంది. వచ్చే రబీలో రైతులపై కూడా పడే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో ధాన్యం, బియ్యం కొనుగోలుపై గత నెలలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులతో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఇటీవల అన్ని రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఉప్పుడు బియ్యం కొనుగోలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
యాసంగిలో 90% ఆ బియ్యమే
సాధారణంగా తెలంగాణలో యాసంగి(ఎండాకాలం)లో పండించే రకంలో 90 శాతం ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా వినియోగిస్తారు. వానాకాలం (ఖరీఫ్)లో వచ్చే ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మారుస్తారు.ప్రస్తుత కేంద్ర నిర్ణయం ప్రకారం తెలంగాణలో మిల్లింగ్ చేసే ఉప్పుడు బియ్యంలో సగం కూడా కొనే పరిస్థితి లేదు. అయితే గత రబీ సీజన్‌కు సంబంధించి ప్రస్తుతం మిల్లింగ్ అవుతున్న బియ్యంపై స్పష్టత రావాల్సి ఉంది. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసేందుకు ఎఫ్‌సీఐ ఈ బియ్యాన్ని కొనుగోలు చేసేది. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో స్థానికంగా కొంత ఉత్పత్తి పెరడగంతో ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐ ఆమోదించే పరిస్థితి లేదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే రాష్ట్రాలకు పంపిన సమావేశ మినిట్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఇక అదనంగా కొనలేమని చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి సాధారణ బియ్యం తప్ప ఉప్పుడు బియ్యం తీసుకోబోమని పేర్కొన్నారు. ఎగుమతికి ఉపయుక్తంగా ఉండే రకాల ధాన్యాన్ని పండించేందుకు ఆయా రాష్ట్రాలు ప్రాధాన్యమివ్వాలన్నారు.
రక్తహీనత, పోషకాహార లోపాలకు నియంత్రించే వాటిని సాగుచేయాలన్నారు. పంట మార్పిడికి రైతులను సమాయత్తం చేసేలా రాష్ట్రాలు ప్రోత్సాహకాలందించాలని.. పప్పుదినుసులు, నూనెగింజల సాగును పెంచాలని సూచించారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ప్రస్తుత సీజను నుంచి ధాన్యం సేకరణ నిబంధనల్లోనూ మార్పులు చేసింది. ధాన్యంలో 25 శాతం వరకు నూకలను అనుమతించేది. తాజాగా ఈ శాతాన్ని 20కి తగ్గించింది. రబీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చకపోతే ఇది కూడా సమస్య కానుంది.
కేంద్ర స్పందన కోసం ఎదురుచూపు