రుణ యాప్‌ల వ్యవహారంలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సైబర్ క్రైం పోలీసులు లేఖ రాశారు. ఇప్పటి వరకు 190 యాప్‌లు ప్లేస్టోర్‌లో ఉన్నట్లు తెలిపారు. వీటి ద్వారా నిర్వాహకులు రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేస్తున్నారని నివేదించారు. తద్వారా వారి బలవన్మరణాలకు కారణమవుతున్నారని స్పష్టం చేశారు. ఈ యాప్‌లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు సీసీఎస్ సంయుక్త కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు.
రూ.160 కోట్లకు పైగా నగదు...
రుణగ్రహీతల నుంచి వసూలు చేసిన సొమ్మును చైనా సంస్థల నిర్వాహకులు పేమెంట్ గేట్‌వే ద్వారా వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు గుర్తించిన పోలీసులు.. దిల్లీలో ఉన్న వీరి బ్యాంకు అధికారులకు ఫోన్ చేశారు. తమ బ్యాంకుల్లోని ఆయా సంస్థలకు సంబంధించి రూ.160 కోట్లకు పైగా నగదు ఉన్నట్టు పోలీసులకు తెలిపారు. వీటిని స్తంభింపజేయాల్సిందిగా బ్యాంకు అధికారులను పోలీసులు కోరారు.