ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 16వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వైకాపా కార్యకర్త చిన్నపరెడ్డిని సీబీఐ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. సీబీఐ అధికారులు గత కొద్ది రోజులుగా అనుమానితులను విచారిస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని ఢిల్లీకి తీసుకెళ్లి విచారించారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ అధికారులు ఇప్పటికే విచారించారు. వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయ పరమైన అంశాలన్నీ ఎర్ర గంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో విచారణను వేగవంతం చేశారు.