హైదరాబాద్ గుడిమల్కాపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో ఒంటెలతో కలిసి జీవిస్తున్న వీరంతా మధ్యప్రదేశ్ వాసులు. జీవనోపాధిని వెతుక్కుంటూ 20 ఏళ్ల కిందట భాగ్యనగరానికి వచ్చారు. ఒంటెలను బతుకుదెరువుగా చేసుకొని.. నగర వీధుల్లో తిరుగుతూ ఆదాయం పొందుతుంటారు. పిల్లలు పెద్దలు అంతా కలిసి సుమారు 60 మంది వరకు జీవిస్తున్నారు. ఇలా సాగిపోతున్న వీరి జీవితాలను కరోనా వైరస్ అగాధంలోకి నెట్టింది. లాక్‌డౌన్ అమలుతో నెలరోజులుగా ఈ ఒంటెలు గుమ్మం దాటలేదు. ఫలితంగా మెతుకు కరువైంది. ఇప్పటి వరకు సంపాదించిన కొద్దో గొప్పో డబ్బును ఒంటెల ఆహారం కోసం ఖర్చుపెట్టారు. చేతిలో చిల్లిగవ్వలేక.. తిండిగింజలు దొరక్క అల్లాడుతున్నారు.
ఓటర్, ఆధార్ కార్డులున్నా..
వీరిలో చాలా మందికి తెలంగాణ ప్రభుత్వం ఓటరు, ఆధార్ కార్డులను జారీ చేసింది. తెలంగాణ వాసులుగా గుర్తింపునిచ్చింది. వలస కార్మికులను ఆదుకుంటామనే ప్రభుత్వ ప్రకటనతో వీరంతా సమీపంలోని రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. తీరా చేయి చాసే సరికి రేషన్ కార్డు ఎక్కడా అనే ప్రశ్న ఎదురైంది. తమకు రేషన్ కార్డు లేదనే సమాధానంతో వచ్చే గుప్పెడు బియ్యం కూడా.. చేతికందకుండా పోయాయి. ఏంచేయాలో పాలుపోని ఈ బడుగు జీవులు... దాతలిచ్చే ఆహారపొట్లాల కోసం ఎదురుచూడాల్సిన ధీనస్థితి నెలకొంది.