తెలంగాణ

telangana

ETV Bharat / city

కొన్నది నువ్వే.. ఉన్నది ఎవరో: స్థలం కొనుక్కున్న వారికి చుక్కలు - ఎల్‌ఆర్‌ఎస్‌

కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. లక్షలు చెల్లించి కొన్న ప్లాట్​కు.. ఇల్లు కట్టుకునేవరకు పూచీకత్తు లేకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను విశ్లేషించిన అధికారి ఒకరు.. వచ్చిన దరఖాస్తుల్లో సగం కూడా నిబంధనల మేరకు లేవనడం గమనార్హం.

Realtors fruad
Realtors fruad

By

Published : Feb 11, 2022, 4:24 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగుతుండగా కొందరు రియల్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్థలం కొనుక్కున్న వారికి చుక్కలు చూపుతున్నారు. లక్షలు చెల్లించి కొన్న ప్లాట్‌.. ఇల్లు కట్టుకునే వరకు ఉంటుందా? లేదా? అనే భయంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఏ ప్రాంతంలో చూసినా ఒకటో రెండోనే అన్ని అనుమతులు తీసుకొని వేసిన లేఅవుట్‌లు ఉంటున్నాయి. పదుల సంఖ్యలో అక్రమమైనవి దర్శనమిస్తున్నాయి. ఎప్పుడో చనిపోయిన సర్పంచ్‌లు ఇచ్చినట్లు కొన్నిచోట్ల అనుమతులు పుట్టిస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, జనగామ జిల్లాలతోపాటు కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మంచిర్యాల జిల్లా కేంద్రాల పరిధిలో వేల లేఅవుట్‌లు వచ్చాయి. ఇటీవల క్రమబద్ధీకరణకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను విశ్లేషించిన అధికారి ఒకరు మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో సగం కూడా నిబంధనల మేరకు లేవన్నారు.

ఆ ప్లాట్‌ నంబరు మీదే.. ఆ స్థలం మీది కాదు

ఓ రిటైర్డ్‌ ఇంజినీరు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు సమీపంలో ఒక లేఅవుట్‌లో స్థలం తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. గుర్తింపు పొందిన లేఅవుట్‌లో స్థలం ఉంది కదా అనే ధీమాతో ఉన్నారు. ఇటీవల ఆయన తన స్థలంలో ఇంటిని నిర్మించుకునే ఆలోచనతో అక్కడికి వెళ్లారు. అక్కడ అప్పటికే వేరేవాళ్లు నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదేంటి నా స్థలం కదా? ఇక్కడ నిర్మాణం చేస్తున్నారేంటి అని అడిగితే ‘ఈ స్థలాన్ని మేం కూడా కొనుక్కున్నామ’ని చెప్పారు. వెంచర్‌ డెవలపర్‌ దగ్గరకు వెళ్తే... ‘ఆ ప్లాట్‌ నంబరు మీదే కానీ ఆ స్థలం మీది కాదు. అప్పుడు లేఅవుట్‌ వేరు. ఇప్పుడు వేరు. మీరు చెప్పిన ప్లాట్‌ ఇక్కడుంది చూడండి’’ అని వేరే ఎక్కడో చూపించారు. ‘మేం చూపించింది ఉంచుకుంటారా? లేదంటే మీరు ఆరోజు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తాం’ అని అంటే ఆ రిటైర్డ్‌ ఇంజినీరుకు నోటమాటరాలేదు.

ఒకటే ప్లాటు.. మళ్లీ మళ్లీ అమ్మేయ్‌

కొన్నిచోట్ల పాత వెంచర్లలో కొత్త వివాదాలకు తెరతీస్తున్నారు. గతంలో అమ్మిన ప్లాట్లను ఇతరులకు విక్రయించడం సాధారణంగా మారింది. పదేళ్లనాటి ధరలకు ఇప్పటికి భారీ తేడా ఉండటంతో కొందరు లేఅవుట్‌ డెవలపర్లు అక్రమాలకు తెరదీస్తున్నారు. గతంలో వేసిన లేఅవుట్‌లలో ప్లాట్‌ నంబర్లు మార్చేసి అమ్ముతున్నారు. కొందరు డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. చాలామంది కేసులు, వివాదాల జోలికి వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు.

పర్యవేక్షణ నాస్తి

అక్రమ లేఅవుట్‌లపై కఠినంగా వ్యవహరించాల్సిన స్థానిక సంస్థల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం లేదా వెంచర్‌ డెవలపర్లకు సహకరిస్తుండటంతో భారీగా అక్రమ లేఅవుట్‌లు పుట్టుకొస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో అక్రమ లేఅవుట్‌లకు మరింత ఊతం లభిస్తోంది.

అనుమతి ఉన్న లేఅవుట్‌ను గుర్తించేదెలా?

* హెచ్‌ఎండీఏ పరిధిలో అయితే హెచ్‌ఎండీఏ, ఇతర ప్రాంతాల్లో అయితే డీటీసీపీ అనుమతి ఉండాలి.

* హెచ్‌ఎండీఏ లేదా డీటీసీపీ అనుమతికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. అలా ఉన్న వాటికే అనుమతి ఉన్నట్టు లెక్క.

* అనుమతి పొందిన లేఅవుట్‌లో రోడ్లు, ఖాళీ స్థలాలు నిర్దేశించిన మేరకు ఉండాలి.

* లేఅవుట్‌ను రెరా వద్ద నమోదు చేసుకుని ఉండాలి. రెరా నమోదు ఉన్నవాటికి రెరా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది.

* రెరా గుర్తింపు ఉంటే ఆ చట్టం ప్రకారం కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు, న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుంది.

* లేఅవుట్‌ వేసిన స్థలం నాలా మార్పు(కన్వర్షన్‌) జరిగిందా? లేదా? అనేదీ పరిశీలించాలి.

అగ్రిమెంట్‌ చేసుకున్నది కాదు.. ఇచ్చింది తీసుకో

ఇటీవల హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఒకరు మహేశ్వరం వద్ద అన్ని గుర్తింపులూ ఉన్న.. చివరకు రెరా వద్ద రిజిస్టర్‌ అయిన ప్రముఖ వెంచర్‌లో రూ.24 లక్షలకు ప్లాట్‌ మాట్లాడుకున్నారు. ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. తీరా రిజిస్ట్రేషన్‌ చేసుకుందామని వెంచర్‌ డెవలపర్‌ని సంప్రదించగా ఆ ప్లాటు మారిందని ఇప్పుడు చెబుతున్నారు. ‘‘మీ ప్లాట్‌ను ఒక ముఖ్యనేత అనుచరుడు తీసుకున్నారు. ఆ ప్లాట్‌ ఇప్పుడు లేదు, కావాలంటే వేరేది ఇస్తాం’’ అని అనడంతో ఆయనకు ఏమీ పాలుపోవట్లేదు. అగ్రిమెంట్‌ చేసుకున్న ప్లాట్‌నే రిజిస్టర్‌ చేయాలని అడిగితే ప్రముఖ నాయకుల పేర్లను చెప్పి బెదిరించారు.

ఆదిలాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు కూడా...

వెంచర్లకు పక్కన ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని కూడా సొంతవిగా చూపి విక్రయించేస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ప్రభుత్వ భూమిని, చివరకు రైల్వేకు కేటాయించిన దానిని కూడా ప్లాట్లుగా వేసి విక్రయించగా కొన్నవారు లబోదిబోమంటున్నారు. వెంచర్‌ డెవలపర్‌ మాత్రం కొత్త వెంచర్లు అంటూ మళ్లీ దర్జాగా ప్లాట్లు అమ్ముకుంటున్నాడు.

ఇదీ చూడండి:cancer: మద్యంతో కాలేయంతో పాటు ఇతర అవయవాలకూ క్యాన్సర్‌.. !

ABOUT THE AUTHOR

...view details