మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన సీఎం కేసీఆర్... ఈరోజు తోక ముడుచుకుని పారిపోయాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈరోజు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా రెండు తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు కుమ్మకయ్యారని ప్రజలకు అర్థమైందన్నారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్... తెలంగాణ పౌరుషాన్ని ఎక్కడ వదిలిపెట్టారని ప్రశ్నించారు.
'కేసీఆర్... నీ తెలంగాణ పౌరుషం ఎక్కడికి పోయింది?' - bjp leaders fire on cm kcr
ఈరోజు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మకైనట్లు ప్రజలకు అర్థమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్... మరి నేడు ఆ తెలంగాణ పౌరుషం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా పంపాలని కేంద్రం మూడుసార్లు లేఖలు పంపినా.. సీఎం కేసీఆర్ ఎందుకు పంపించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 203 జీవో వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని కేంద్రానికి ముందే తెలిపితే నేడు సమావేశంలో చర్చ జరిగేదని బండి సంజయ్ తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పుడు ట్రైబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం లేదని కేంద్రం తెలిపినా... అదే కావాలని కేసీఆర్ కోరడంలో అర్థమేంటన్నారు.
ట్రైబ్యునల్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుని కేంద్రాన్ని కోరితే ట్రైబ్యునల్ ఏర్పాటయ్యేదని హితవు పలికారు. డీపీఆర్‌లు పంపాలని కోరినప్పటికీ పంపించకపోవడానికి గల కారణాలేమిటో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.