తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భాజపా దూకుడు పెంచింది. తెరాస సర్కార్ వైఫల్యాలను నిత్యం ప్రజా క్షేత్రంలో ఎండగడుతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను సమీకరించుకునే పనిలో పడింది. ఇతర పార్టీల నుంచి ప్రజా, ఆర్థిక బలం ఉన్న నేతలను భాజపాలో చేర్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరేందుకు ఎమ్మెల్యేలు సైతం టచ్‌లో ఉన్నారంటూ రాష్ట్ర నాయకత్వం బహిరంగంగా ప్రకటించింది. ఈ చేరికలపై ఎప్పటి నుంచి దృష్టి పెడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంక్రాంతి తరువాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను చేర్చుకోవాలని భావించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో చేరికల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏ ఉద్దేశంతో వస్తున్నారో తెలుకున్నాకే..
భాజపాలోకి చేరికలు మొదలైతే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ పటిష్ఠం అవ్వడానికి అంత కష్టమేమీ కాదన్న భావనలో కాషాయదళం ఉంది. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భాజపాను ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారని.. సమయం వస్తే పార్టీకి అండగా ఉంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేయాలని యోచిస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవరు వస్తున్నారు.. ఏ ఉద్దేశంతో వారు భాజపాలో చేరుతున్నారన్న దానిపై పూర్తిగా సమాచారం సేకరించిన తరువాతే నేతలను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్టుగా నేతలను పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని భాజపా ఆలోచిస్తోంది.
బంగాల్ పరిస్థితి రాకుండా జాగ్రత్త..