హఫీజ్‌పేటలోని 48 ఎకరాల భూములను చాలా ఏళ్లక్రితం భూమా నాగిరెడ్డి కొనుగోలు చేశారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. ఐదేళ్లక్రితం ప్రవీణ్‌రావు అదే సర్వే నంబరులో 25 ఎకరాలు కొనుగోలు చేశారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. దీనిపై వివాదం తలెత్తడంతో ప్రవీణ్‌రావు వర్గీయులు రాజీ కోసం ఏవీ సుబ్బారెడ్డిని సంప్రదించారు. ఈలోగా నాగిరెడ్డి మృతి చెందారు. గత ఏడాది సెప్టెంబరులో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించగా, ప్రవీణ్‌రావు మియాపూర్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాగిరెడ్డి చనిపోయాక భూములను సొంతం చేసుకునేందుకు అఖిలప్రియ, ఆమె సోదరి మౌనిక ప్రయత్నిస్తున్నారు.
కిడ్నాపర్లకు శిక్షణ.. పక్కాగా రెక్కీ
ప్రవీణ్‌రావు, అతడి సోదరులు తమ మాట వినడం లేదని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ వారి అపహరణకు పథకం వేశారని పోలీసులు తెలిపారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాలతో మాట్లాడారు. వారం రోజుల క్రితం 15 మందిని హైదరాబాద్‌కు రప్పించారు. హైదరాబాద్ శివార్లలోని భార్గవరామ్ స్నేహితుడికి చెందిన ఓ పాఠశాలలో వారిని ఉంచి ఆదాయపుపన్ను అధికారుల్లా నటించాలంటూ శిక్షణ ఇచ్చారు. ప్రవీణ్, నవీన్, సునీల్రావులుంటున్న ఇంటి వద్ద కిడ్నాపర్లు నాలుగు రోజుల నుంచి రెక్కీ నిర్వహించి మంగళవారం రాత్రి రంగంలోకి దిగారు.
నాకు సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డి
‘కిడ్నాప్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆయన మాదాపూర్‌లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు.