ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధిచి కొత్త ఒప్పందం చేసుకుంది. కరోనా నియంత్రణలో భాగంగా నాజల్ స్ప్రే వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు చేస్తున్న వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెయింట్ లూయీస్‌తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలు చేస్తున్న ఈ ఇంట్రా నాజల్ స్ప్రేని యూఎస్, జపాన్ , యూరప్ మినహా ఇతర ప్రపంచ దేశాలల్లో భారత్ బయోటెక్ మార్కెటింగ్ చేయనుంది.
వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం
వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. నాజల్ స్ప్రే వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందం చేసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
ఇప్పటికే ఎలుకల్లో జరిపిన పరిశోధనల్లో ఈ వ్యాక్సిన్ సత్ఫతాలు ఇవ్వగా.. త్వరలో సెయింట్ లూయిస్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్ యూనిట్లో మానవులపై ఫేజ్-1 ట్రయల్స్ జరపనున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌కి తగిన అనుమతులు తీసుకుని తర్వాతి దఫా క్లినికల్ ట్రయల్స్ భారతదేశంలో నిర్వహించటం తోపాటు... భారీ ఎత్తున వ్యాక్సిన్ తయారీ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ముక్కు ద్వారా పీల్చే ఇలాంటి వ్యాక్సిన్ల వినియోగం సులభతరంగా ఉండటంతోపాటు.... వైద్య పరికారల వినియోగాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా వ్యాక్సిన్ ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని భారత్ బయోటెక్ తమ ప్రకటనలో తెలిపింది.