కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతోన్న ఈ తరుణంలో.. ప్రజలకు తాము చేయగలిగిన సాయాన్ని చేస్తోన్న వారు కొందరైతే.. ఈ విపత్కర పరిస్థితిని అసరాగా చేసుకొని వాళ్లను మోసం చేస్తోన్న వాళ్లు మరికొందరు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ వేదికల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా పేరుతో రకరకాల మొబైల్ యాప్స్‌ను సృష్టించి ఫోన్లలో ఉన్న బ్యాంక్ ఎకౌంట్ వివరాలు, సోషల్ మీడియా లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు.. తదితర ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.
కరోనా పేరుతో ఉన్న ఫేక్ మొబైల్ యాప్స్
CoronaVirus App
ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు సంబంధించిన పాజిటివ్ కేసులు, ఇతర సమాచారాన్ని మీకు యాప్ ద్వారా అందిస్తామని మీకు సందేశం వచ్చినా, ప్రకటన కనిపించినా.. దానిని నమ్మకండి. ఇవి మీ ఫోన్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తుంటాయి. ఈ క్రమంలో ‘Coronavirus’ పేరుతో చలామణీలో ఉన్న ఓ మొబైల్ యాప్ కూడా మోసపూరితమైంది. ఈ యాండ్రాయిడ్ యాప్ Pin/Pattern లను పదే పదే ఇవ్వమని కోరుతుంది. తద్వారా ఆ యాప్‌లో ఉండే కోడ్ మీ ఫోన్‌లోకి ప్రవేశించి దానిని కంట్రోల్ చేస్తుంది.
Coronavirus Map
ఈ యాప్ ద్వారా మీరు కరోనాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ పొందవచ్చని ప్రచారం చేస్తారు. కానీ, నిజానికి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ ఫోన్‌లోకి Spy Software ఇన్‌స్టాల్ అవుతుంది. తద్వారా మీ అనుమతి లేకుండానే ఇంటర్నెట్ నుంచి Spyware (సాఫ్ట్‌వేర్ వైరస్) ఉన్న ఫైళ్లను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అయ్యేలా ఇది ప్రోత్సహిస్తుంది.
Corona live 1.1
ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీ ఫోన్ లొకేషన్‌తో పాటు.. అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు, ఇతర మీడియా ఫైల్స్‌పై యాక్సెస్ రిక్వెస్ట్ అడుగుతుంది. అంతేకాదు, ఫొటోలు తీసేందుకు, వీడియో రికార్డ్ చేసేందుకు కూడా అనుమతి అడుగుతుంది. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘Trojan Virus’ కి చెందిన ‘SpyMax Sample’ అనే వైరస్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. తద్వారా మీ ఫోన్‌లో ఉన్న సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.
CoronaVirus Finder
మీకు చేరువలో కరోనా సోకిన వ్యక్తి ఉంటే.. వారిని ఈ యాప్ ద్వారా కనిపెట్టొచ్చని మీకు ప్రకటన వస్తుంది. కరోనాకు సంబంధించి మరిన్ని వివరాలు పొందడానికి ఇందుకోసం మీరు కొంత నగదు చెల్లించాలని సందేశం పంపిస్తారు. అంతేకాదు, మీరు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీ క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్ వివరాలను దొంగిలిస్తుంది.
Corona-Apps.apk
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీకు క్షణాల వ్యవధిలో నోటిఫికేషన్లు పంపుతుంటుంది. ఈ యాప్‌ను అన్-ఇన్‌స్టాల్ చేస్తే తప్ప వీటిని ఆపలేం. ఈ నోటిఫికేషన్లను క్లిక్ చేసినప్పుడు మీ ఫోన్‌లో ఉన్న సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తుంది.