తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2022, 4:29 AM IST

ETV Bharat / city

రైతుల ఖాతాలో సాయం పడగానే.. రుణాల పేరిట బ్యాంకుల కోతలు..

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. వ్యవసాయ సీజన్‌లో సాగు పెట్టుబడుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడొద్దన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వం పెట్టుబడి సాయం సొమ్మును ఖాతాల్లో జమ చేసినా రైతులకు మాత్రం నిరాశ తప్పడం లేదు. కర్షకలోకం సంబరపడే లోపే బ్యాంకులు వారి ఆనందాన్ని నీరుగారుస్తున్నాయి. బకాయిల పేరిట మళ్లిస్తున్న బ్యాంకుల తీరుతో సాగుదారుకు ప్రభుత్వ సాయం చేతికందకుండా పోతోంది.

Bank cut in the name of loans from farmers after receiving rythubhandhu
Bank cut in the name of loans from farmers after receiving rythubhandhu

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డిసెంబర్ 28 నుంచి యాసంగి సీజన్‌కు పెట్టుబడి సాయం అన్నదాతల ఖాతాల్లో జమ అవుతోంది. ఇప్పటికే 5 ఎకరాల సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ అయ్యింది. ఖమ్మం జిల్లాలో 2 లక్షల 80 వేల 182 మంది రైతులకు 242.78 కోట్లు ఖాతాల్లో చేరాయి. భద్రాద్రి జిల్లాలో లక్షా 23 వేల 597 మందికి 148 కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అయ్యింది.

పెట్టుబడి సాయం ఖాతాల్లో చేరిందన్న సంబరం రైతులకు ఎంతోసేపు నిలవడం లేదు. బ్యాంకుల తీరుతో ప్రభుత్వ సాయం చేతికందని పరిస్థితి నెలకొంది. బకాయిల పేరిట బ్యాంకర్లు తమకు చెల్లించాల్సిన రుణాలకు మళ్లించుకుంటున్నారు. జమ అయిన నగదు తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన దాదాపు రైతులందరికీ... రుణాల పేరిట జమ చేసుకున్నామని సమాధానం చెబుతున్న అధికారుల తీరుతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

గత సీజన్‌ ఆరంభానికి ముందు రైతులకు ఇదే పరిస్థితి ఎదురైతే... ప్రభుత్వం స్పందించి రైతుబంధు సొమ్మును రుణాల పేరిట మళ్లించుకోవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ.. ఈసారి కూడా మళ్లీ పెట్టుబడి సాయం జమ చేసుకోవడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మరోసారి జోక్యం చేసుకుని రైతు బంధు సొమ్ము తమకు అందేలా చూడాలని కోరుతున్నారు.

వివిధ కారణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 వేల 658 మంది రైతుబంధు అందడం లేదు. ఆన్ లైన్‌లో సాంకేతిక సమస్యలు, PM కిసాన్ సమ్మాన్ యోజనలో పేర్లు నమోదుకాకపోవం, పట్టాదారు పాసుపుస్తకం ఉన్నా ఆన్‌లైన్‌లో భూమి లేనట్లు చూపుతుండటంతో పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. భూమి ఉన్న ప్రతి హక్కుదారుకు ప్రభుత్వ ఫలం అందుతున్నా తమకు మాత్రం అందకపోవడంతో అన్నదాతల్లో తీరని వేదన కలిగిస్తోంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details