Bandi Sanjay Fire on KCR: కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణను ధనిక, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలూ ఇవ్వడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా జీతాలు చెల్లిస్తూ.. ప్రతి నెలా రెండోవారం దాకా సాగదీస్తున్నారని దుయ్యబట్టారు.
Bandi Sanjay Comments on KCR: ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్, ఎడ్యుకేషన్ కన్షెషన్, సరెండర్ బిల్లులు గత 7 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెల వేతనం కూడా ఇంకా చెల్లించలేదంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్‌లో కూడబెట్టుకున్న డబ్బులను.. తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ సభ్యులకు చికిత్స కోసం వాళ్లు ఆరాటపడుతుంటే వాటినీ చెల్లించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను గత 2 ఏళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని సంజయ్ ప్రశ్నించారు.