తెలంగాణ

telangana

ETV Bharat / city

బక్రీద్ ఖుర్బానీ... పెరిగిన పొట్టేళ్ల గిరాకీ

త్యాగనిరతికి ప్రతీకగా ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ సందడి జంటనగరాల్లో మొదలైంది. పండుగ సందర్భంగా పొట్టేళ్లు, గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి. అమ్మకందారులు, కొనుగోలుదారులతో  మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గతేడాది కంటే ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

బక్రీద్ ఖుర్బానీ... పెరిగిన పొట్టేళ్ల గిరాకీ

By

Published : Aug 11, 2019, 6:34 AM IST

Updated : Aug 11, 2019, 8:00 AM IST

జంటనగరాల్లో బక్రీద్ సందడి మొదలైంది. ముస్లిం సోదరులు పండుగకు సిద్ధమవుతున్నారు. బక్రీద్ సందర్భంగా గొర్రెలు, పొట్టేళ్లు, మేకలను కొనుగోలు చేయడం ఆనవాయితీ. పాతబస్తీలో వీటి విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. సమయం దగ్గర పడుతుండటం వల్ల గిరాకీ బాగా పెరిగింది. గతేడాదితో పోల్చితే ధరలు రెండు నుంచి మూడు వేలు పెరిగినట్లు తెలుస్తోంది. పండుగ సందర్భంగా మాంసాన్ని మూడు భాగాలు చేసి... ఒక భాగం కుటుంబసభ్యులకు, ఇంకో భాగం బంధువులకు, మరోభాగం పేదలకు పంచితే పుణ్యం వస్తుందని వారి నమ్మకం.

హజరత్‌ ఇబ్రహీం, ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో సంతానం కలుగుతుంది. లేక లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్‌ను వృద్ధ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్‌ను అల్లాకు ఖుర్బానీ (దేవునికి బలిదానం చేయడం) ఇస్తున్నట్లు కలగంటాడు. అందుకు కుమారుడు కూడా అంగీకరిస్తాడు. తన కుమారుడిని కుర్బానీ ఇచ్చే సమయంలో అల్లా ఇస్మాయిల్‌ను తప్పించి పొట్టేలును ప్రత్యక్షం చేశాడని ముస్లింల నమ్మకం. అప్పటి నుంచి త్యాగనిరతికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండగను జరుపుకుంటారు.


మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ ప్రాంతాల భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్న గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ధరలు పెరగటం వల్ల కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది. రవాణా ఛార్జీలు, పొట్టేళ్ల పోషణ వ్యయం పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చినట్లు అమ్మకందారులు చెబుతున్నారు. బక్రీద్ సమీపిస్తుండటం వల్ల తాము తెచ్చిన పొట్టేళ్లు అమ్ముడుపోతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరిగినందున తక్కువ మాంసం కొనుగోలు చేస్తున్నామని కొనుగోలుదారులు అంటున్నారు. పండుగకు ముందురోజు పొట్టేళ్ల కొనుగోళ్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. మార్కెట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

బక్రీద్ ఖుర్బానీ... పెరిగిన పొట్టేళ్ల గిరాకీ

ఇదీ చూడండి: కాళేశ్వరం ఆనకట్టలు, పంపుహౌస్​లకు దేవతల పేర్లు

Last Updated : Aug 11, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details