తెలంగాణ

telangana

ETV Bharat / city

అఫ్గానిస్థాన్​ రాయబారి కూతురిపై దుండగులు దాడి

పాకిస్థాన్​లోని అఫ్గాన్​ రాయబారి కూతురి అపహరణ, దాడి ఇరు దేశాల్లో తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం యువతిని అపహరించి సుమారు 5 గంటల పాటు తీవ్రంగా హింసించినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ ఘటనపై సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది అఫ్గాన్​ విదేశాంగ శాఖ. ఈ మేరకు కాబుల్​లోని పాక్​ రాయబారికి సమన్లు జారీ చేసింది.

Afghan
Afghan

By

Published : Jul 26, 2021, 3:51 PM IST

పాకిస్థాన్​లోని అఫ్గానిస్థాన్​ రాయబారి కూతురిపై దుండగులు దాడి చేశారు. పాక్​ రాజధాని ఇస్లామాబాద్​ నగరం నడిబొడ్డులో యువతిని అపహరించి కొన్ని గంటల పాటు తీవ్రంగా హింసించారు. ఈ విషయాన్ని ఇరు దేశాల అధికారులు ధ్రువీకరించారు.

రాయబారి కూతురు సిల్లిలా అలిఖిలా(26)పై శుక్రవారం దాడి జరగ్గా.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్​ చేయలేదు. ఈ క్రమంలో సత్వరం చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ ప్రకటన విడుదల చేసింది అఫ్గాన్​ విదేశాంగ శాఖ. యువతిని తీవ్రంగా హింసించారని పేర్కొంది. ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు, మణికట్టు, కాళ్లపై తాడు గుర్తులు ఉన్నాయని, తీవ్రంగా కొట్టినట్లు ఆసుపత్రి నివేదికలో ఉందని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా​ సంస్థ తెలిపింది. కొన్ని ఎముకలు సైతం విరిగినట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొంది.

యువతిని సుమారు 5 గంటల పాటు తమ అధీనంలో ఉంచుకొని దాడి చేసినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అనంతరం ఆమెను పోలీసులు.. ఇస్లామాబాద్​లోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నాయి. అయితే.. ఆమె అపహరణ, విడుదల చేసిన సందర్భాలపై ఎలాంటి విషయాలు తెలియదని తెలిపాయి.

అయితే ఈ దాడితో తీవ్రంగా కలత చెందినట్లు పాకిస్థాన్​ ప్రకటించింది. ఇస్లామాబాద్​లోని అఫ్గాన్​ రాయబారి నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

పాక్​ రాయబారికి సమన్లు..

ఈ దాడిని తీవ్రంగా ఖండించాల్సిన, నీచమైన చర్యగా అభివర్ణంచింది అఫ్గాన్​ విదేశాంగ శాఖ. పాక్​లోని అఫ్గాన్​ దౌత్యవేత్తలు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గాన్​లోని పాకిస్థాన్​ రాయబారి మాన్​సూర్​ అహ్మద్​ ఖాన్​కి సమన్లు జారీ చేసింది. అఫ్గాన్​ రాయబారి కూతురి అపహరణ, దాడిపై నిరసన వ్యక్తం చేసింది.

ఇరుపక్షాల ఆరోపణలు..

ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. అఫ్గాన్​లో దాడులు చేసేందుకు పాకిస్థాన్​ వేలాది మంది జిహాదీలను పంపుతోందని, తాలిబన్లకు పాక్​ సురక్షితమైన ప్రదేశమని ఆరోపించింది. మరోవైపు.. పాక్​ వ్యతిరేక తెహ్రీక్​ ఈ తాలిబన్​ పాకిస్థాన్​, బలుచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీలకు కాబుల్​ స్థావరంగా మారిందని పాకిస్థాన్​ ఆరోపిస్తోంది.

ఇదీ చూడండి: సీఎం రేసులో ఆ 9 మంది- అవకాశం ఎవరికి?

ABOUT THE AUTHOR

...view details