ఏపీలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో... చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో జరగనుంది. చిత్తూరు జిల్లా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తిరుపతిలోని ఎస్.వి.విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు.
మొదట సర్వీసు ఓటర్లకు ఆన్లైన్ ద్వారా పంపించిన ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్, ఆ తర్వాత ఈవీఎం మిషన్లలోని ఓట్లు లెక్కిస్తారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు పత్రాలు ఉంటేనే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తారు. కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ పీపీఈ కిట్ తప్పక ధరించాలనే నిబంధనలు విధించారు. కౌంటింగ్ ప్రక్రియలో అత్యధికంగా 25 రౌండ్లు ఉండబోతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 8 టేబుల్స్‌లో ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు.