ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లను బదిలీ చేస్తూ, అభిశంసిస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అభిశంసన ఉత్తర్వులను వారి సర్వీసు రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని, సిబ్బందిని, వనరులను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమకూర్చాలని హైకోర్టు ఆదేశించినా ద్వివేది, గిరిజా శంకర్ పెడచెవిన పెట్టారని, ఎంత మాత్రం సహకరించలేదని పేర్కొన్నారు. 2021 ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో వాళ్ల నిర్లక్ష్యంవల్ల ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 3.62 లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోతున్నారని తెలిపారు. వారిద్దరి సారథ్యంలోని పంచాయతీరాజ్‌శాఖ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఘోరంగా విఫలమయ్యాయని రమేశ్ కుమార్ మండిపడ్డారు. వారిద్దరూ కావాలని, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని, తమ బాధ్యతను విస్మరించారని తెలిపారు.
క్షమించరాని తప్పిదం..
ఇదేదో సాధారణ పొరపాటు కాదని, క్షమించరాని తప్పిదమని నిమ్మగడ్డ పేర్కొన్నారు. 2021 ఓటర్ల జాబితాలను ప్రచురించాలన్న ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలను వారు ఖాతరు చేయకపోవడంవల్ల, విధిలేని పరిస్థితుల్లో, స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ విధిని నిర్వర్తించేందుకు 2019 ఓటర్ల జాబితాల ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘ఎన్నికలకు, తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు వారిద్దరూ గట్టిగా ప్రయత్నించారు. యువత ఓటు హక్కు కోల్పోవడానికి వారిద్దరిదే పూర్తి బాధ్యత. వారు చేసిన తప్పు క్షమించరానిది’ అని పేర్కొన్నారు. ద్వివేది, గిరిజా శంకర్‌ల వైఖరిని తీవ్ర పదజాలంతో తప్పుపడుతూ రమేశ్ కుమార్ 8 పేజీల అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ బాధ్యతలను నిర్వహించే అర్హతలు వారికి లేవు
గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ల వ్యవహార శైలిని చూస్తే... పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు విధులు నిర్వర్తించేందుకు వారు పనికిరారని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ‘73వ రాజ్యాంగ సవరణ నిర్దేశించిన క్షేత్ర స్థాయి ప్రజాస్వామ్యం, స్థానిక సంస్థల సాధికారత భావనలను ద్వివేది విస్మరించారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం పౌరులకు ఓటుహక్కు కల్పించాల్సిన విషయంలో వ్యతిరేక ధోరణితో వ్యవహరించారు. ఎన్నికల సంఘంతో చర్చల సందర్భంలోనూ ఆయన విరుద్ధ భావనలతో ఉండేవారు. కమిషన్ స్వతంత్రతకు భంగం కలిగించేందుకు ప్రయత్నించారు. గతంలో ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతాయుతమైన పదవిలో పని చేశారు. ఎన్నికల విధులు, బాధ్యతల గురించి ఆయనకు అవగాహన ఉన్నా.. ప్రస్తుత బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో వివేకం, పరిణతి లేకుండా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లో ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగడం క్షేత్ర స్థాయిలోని ప్రజాస్వామ్య సంస్థల పనితీరుకు విఘాతం కలిగిస్తుంది. ఆ పోస్టులో కొనసాగేందుకు అవసరమైన అర్హతలు, బుద్ధి, మనసు ఆయనకు లేవని పదే పదే రుజువైంది’ అని రమేశ్ కుమార్ అభిశంసించారు. గిరిజాశంకర్ విషయంలోనూ ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.