ప్రభుత్వ పథకాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్తో పాటు రాజకీయ నేతల పేర్లు పెట్టడాన్ని(AP HC on CM name for schemes) సవాలు చేస్తూ.. దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో సీఎంను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై ఆ రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇదే వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడాన్ని సమర్థించింది. ముఖ్యమంత్రి పేరును తొలగించి పిల్కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ప్రజాధనం దుర్వినియోగం
కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి, వివిధ సాంఘిక సంక్షేమ పథకాలకు రాజకీయ నేతల పేర్లతో పాటు ముఖ్యమంత్రి జగన్ పేర్లు పెట్టడాన్ని(AP High court on names for Schemes) సవాలు చేస్తూ డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL ON SCHEMES ) దాఖలు చేశారు. అయితే ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాదబాబు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టడం సరికాదన్నారు. అంతిమ లబ్ధిదారు ముఖ్యమంత్రి కాబట్టి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చామన్నారు. గతంలో వైకాపా పార్టీ జెండా రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. న్యాయస్థానం ఆ విషయాన్ని తప్పుపట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలకు రాజకీయ నేతల పేర్లు పెట్టడం అదే తరహాలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు.