Brothel Customer : వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడిపై (కస్టమర్) కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో విచారించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వ్యక్తిపై దిగువ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు 2020లో నమోదు చేసిన కేసు ఆధారంగా గుంటూరులోని మొదటి తరగతి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో (ప్రత్యేక మొబైల్ కోర్టు) తనపై పెండింగ్‌లో ఉన్న కేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
AP High Court News : అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2020 అక్టోబరు 10న పోలీసులు పిటిషనరుపై కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరిపి, సంబంధిత కోర్టులో అభియోగపత్రం వేశారని తెలిపారు. వ్యభిచార గృహంపై దాడి చేసినప్పుడు అక్కడ పిటిషనరు కస్టమర్‌గా ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారిపై కేసు పెట్టి విచారించవచ్చు గానీ.. సొమ్ము చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని విచారించడానికి వీల్లేదని చట్ట నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు. వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును ఇదే కోర్టు గతంలో కొట్టేసిందని గుర్తు చేశారు. అదనపు పీపీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనరు కేవలం కస్టమర్ మాత్రమేనని తెలిపారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి.. పిటిషనర్‌పై కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.