భూమికి పరిహారం చెల్లింపు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులుగా పేర్కొంటూ ముగ్గురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష, జరిమానా విధించింది. మరో ఇద్దరికి జరిమానాతో సరిపెట్టింది. పిటిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఖర్చులు చెల్లించాలని, ఆ సొమ్మును బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అధికారుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగువారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ తీర్పు ఇచ్చారు.
- విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల సాధారణ జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా. జరిమానా చెల్లింపులో విఫలమైతే ఏడు రోజుల జైలుశిక్ష.
- ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా. సొమ్ము చెల్లిచకపోతే 7రోజుల జైలుశిక్ష.
- నెల్లూరు జిల్లా పూర్వ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా. అది చెల్లించకపోతే మూడు రోజుల జైలు శిక్ష.
- మరో పూర్వ కలెక్టర్ ఏవీ శేషగిరిబాబుకు రూ.2వేల జరిమానా. చెల్లించకపోతే ఏడు రోజుల జైలుశిక్ష.
- నెల్లూరు జిల్లా ప్రస్తుత కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌కు రూ.2 వేల జరిమానా, చెల్లించని పక్షంలో ఏడు రోజుల జైలుశిక్ష.