తెలంగాణ

telangana

ETV Bharat / city

Chalo Vijayawada News : అడ్డుకున్నా.. అరెస్టు చేసినా.. అణచివేసినా.. ఆగని ఉద్యోగ పోరు

Chalo Vijayawada News : ఉపాధ్యాయులు గళమెత్తారు. పిల్లలకే కాదు.. ప్రభుత్వానికి పాఠాలు చెబుతామంటూ నినదించారు. ‘చలో విజయవాడ’కు వెళ్లొద్దంటూ వివిధ జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోలీసులు నోటీసులిచ్చారు. మౌఖికంగా హెచ్చరించారు. ఇళ్ల ముందు కాపలా ఉన్నారు. అయినప్పటికీ భారీ సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొన్నారు. వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

Chalo Vijayawada
Chalo Vijayawada

By

Published : Feb 4, 2022, 9:49 AM IST

Chalo Vijayawada News : ‘చలో విజయవాడ’కు వెళ్లొద్దంటూ వివిధ జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోలీసులు నోటీసులిచ్చారు. మౌఖికంగా హెచ్చరించారు. ఇళ్ల ముందు కాపలా ఉన్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. అయినా ఎవ్వరూ బెదరకపోవడంతో ప్రతి జిల్లాలోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అడుగడుగునా అడ్డుకున్నారు. బస్సులు, కార్లు, లారీల్లో వస్తున్న వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. సెల్‌ఫోన్లలో కాల్‌లిస్టులు, వాట్సప్‌ గ్రూప్‌లను పరిశీలించారు. వాహనాల నుంచి దించేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దాంతో వారంతా పిల్లలకే కాదు, ప్రభుత్వానికీ పాఠాలు చెబుతామంటూ గర్జించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే స్మగ్లర్ల మాదిరిగా బస్సులు, రైళ్ల నుంచి దింపడమేనా? అని నిలదీశారు.

అడ్డుకుని.. పోలీస్‌స్టేషన్లకు తరలించి

AP Employees Protest : గుంటూరు జిల్లాలో ఖాజా టోల్‌గేట్‌ వద్ద, వారధి వద్ద పెద్దఎత్తున పోలీసుల్ని మోహరించారు. కృష్ణా జిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై దావులూరు టోల్‌గేట్‌, ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి వద్ద తనిఖీలు చేశారు. నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి లారీల్లో వస్తున్న ఉపాధ్యాయుల్ని వారధి వద్ద అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వారిని విజయవాడ పటమటలోని ఆటోమొబైల్‌ టెక్నికల్‌ అసోసియేషన్‌ హాల్‌కు తరలించారు. చిల్లకల్లు, గౌరవరం, తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. నందిగామ, పెనుగంచిప్రోలు, పులిగడ్డ వారధి తదితర ప్రాంతాల్లోనూ ఉపాధ్యాయుల్ని నిలిపేశారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి వస్తున్న వందలాది మందిని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిలిపేశారు. త్రిపురాంతకం మండలం మేడపి టోల్‌ప్లాజా వద్ద ఉద్యోగ సంఘాల నాయకుల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించారు. ఒంగోలు, సింగరాయకొండ రైల్వేస్టేషన్లలోనూ పలువురిని నిలిపేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద విశాఖ జిల్లా పాడేరు నుంచి వస్తున్న ఉద్యోగుల బస్సుల్ని నిలిపేసి, వెనక్కి పంపారు. కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జిని అడ్డుకుని, బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. నరసాపురం రైల్వేస్టేషన్‌లో, పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రాజమండ్రి నుంచి బస్సులో వెళుతున్న ఉద్యోగుల్ని అడ్డుకున్నారు. వీఆర్వోల సంఘం ఉద్యోగుల వాహనాన్ని ఏలూరులో అడ్డగించి, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

బెజ‘వాడవాడన నిఘా’

Chalo Vijayawada News : ‘చలో విజయవాడ’ నేపథ్యంలో బెజవాడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రదర్శన జరిగిన బీఆర్‌టీఎస్‌ రోడ్డులో కొత్తగా వంద సీసీ కెమెరాలను బిగించారు. ఈ ప్రాంతంలోనే 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరిలో ఎవ్వరూ లాఠీలను ఉపయోగించలేదు. పరిస్థితి అదుపు తప్పితే అరెస్టులు చేసేందుకు మాత్రం పెద్ద సంఖ్యలో వాహనాలను సిద్ధంగా ఉంచుకున్నారు. బస్టాండు, రైల్వేస్టేషను, చెక్‌పోస్టులు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న వారిని ఆయా స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత వదిలిపెట్టారు.

రైళ్ల చైన్‌లాగి.. సహచరులకు సమాచారం

AP Employees Agitation : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కోటిపల్లి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, రోడ్‌కమ్‌ రైల్వే వంతెన, ధవలేశ్వరం బ్యారేజ్‌ దగ్గర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. రైళ్ల నుంచి కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయుల్ని పోలీసులు మధ్యలోనే దించేయడంతో.. అందులో ఉన్నవారు కిలోమీటరు తర్వాత రైళ్ల చైన్‌లాగి నిలిపేశారు. రైలు ఆగింది రమ్మంటూ తమ సహచరులకు సమాచారం అందించారు.

ప్రవాహంలా వాహనాలు..

AP Employees Protest in Vijayawada : అడ్డంకులను అధిగమించి పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు బస్సులు, బైక్‌లు, కార్లు, లారీల్లో గురువారం ఉదయానికే విజయవాడ శివారులోకి చేరుకున్నారు. అక్కడ వాహనాల శ్రేణి భారీ ప్రవాహంలా కన్పించింది. ఒక్కోచోట పోలీసులు నలుగురుంటే ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఖ్య 50కిపైగా చేరింది. దీంతో వాహనాలను తనిఖీ చేయకుండానే వదిలేశారు.

పోలీసన్నా నేడు నేనైతే.. రేపు నువ్వయితే..!

Government Employees Protest in AP : తమను అడ్డుకుంటున్న పోలీసుల ముందు.. పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఆవేదన వినిపించారు. ‘పోలీసన్నా.. ఓయ్‌ పోలీసన్నా.. నన్నాపితే నువ్వాగిపోతావన్నా.. ఈ రోజు నేనైతే రేపేమో నువ్వయితే’ అంటూ వివిధ జిల్లాలోని టోల్‌గేట్ల వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు గీతాలు ఆలపించారు.

వేర్వేరు వేషధారణలతో..

పోలీసుల నిర్బంధం నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు రకరకాల వేషాలు వేసుకున్నారు. నెల్లూరుకు చెందిన ఒక ఉపాధ్యాయుడు పక్షవాతం వచ్చిన వ్యక్తిలాగే నడుస్తూ రైలెక్కారు. కొందరు బస్సుల్ని ఏర్పాటు చేసుకుని, వాటికి వధూవరుల ఫొటోలతో పెళ్లి బ్యానర్లు కట్టారు. మరికొందరు నెత్తిన మూటలతో నడిచారు. రైతుల్లాగే లుంగీ, కండవాలు వేసుకుని బస్సుల్లో బయల్దేరారు. నెల్లూరు జిల్లా నుంచి కొందరు పురోహితులు, ముస్లింల వేషధారణతో కదిలారు. భిక్షగాళ్లలా ప్లేట్లు పట్టుకుని వచ్చారు. పుట్టిళ్లకు, అత్తింటికి వెళ్తున్నామంటూ కొందరు మహిళా ఉపాధ్యాయులు ప్రయాణం సాగించారు.

* ‘పోలీసన్నా.. ఓయ్‌ పోలీసన్నా.. నన్నాపితే నువ్వాగిపోతావన్నా.. ఈ రోజు నేనైతే రేపేమో నువ్వయితే’ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గీతాలు ఆలపించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ నినాదాలతో గురువారం విజయవాడ దద్దరిల్లింది. చలో విజయవాడ ర్యాలీ చేపట్టిన బీఆర్టీఎస్‌ రహదారికి చేరే వీధులన్నీ ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి. నిరసనకు దిగిన నాలుగు కిలోమీటర్ల దారి పొడవునా రణ నినాదాలు మార్మోగాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ‘పీఆర్సీ జీవోలు రద్దు చేస్తావా... గద్దె దిగుతావా? మాట మరవద్దు... మడమ తిప్పొద్దు... సజ్జల డౌన్‌ డౌన్‌.. సీఎం డౌన్‌ డౌన్‌’ అనే నినాదాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హోరెత్తించారు.

*మాకొద్దీ పీఆర్సీ. అంకెలగారడీ పీఆర్సీ

*అప్పుడేమో ముద్దులు... ఇప్పుడేమో గుద్దులు

*విన్నాను.. ఉన్నాను అన్న జగన్‌ ఎక్కడ

*సలహాదారుల్ని పక్కన పెట్టండి... మా మాట వినండి

*మేమూ.. మీ అక్కాచెల్లెళ్లమే

*అణచివేస్తే ఆగేది ఉద్యమం కాదు

ABOUT THE AUTHOR

...view details