ఆనందయ్య ఔషధంపై నేడు తుది నివేదిక రానుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. గ్రామంలోకి స్థానికేతరులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు కృష్ణపట్నం, గోపాలపురంలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి అంబులెన్సుల్లో వచ్చేందుకు రోగులు ప్రయత్నిస్తున్నారు. అలా వచ్చే వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి శనివారం ఆనందయ్యను పోలీసులు వేరే ప్రదేశానికి తరలించారు. ఆదివారం బందోబస్తు మధ్య రహస్య ప్రాంతంలో ఉంచారు.
నిర్బంధించడం విచిత్రం : తల్లోజు ఆచారి
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ వాస్తవ మరణాలను గుర్తించాలని, ఈ విషయాన్ని బీసీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. శనివారం ఆయన నెల్లూరులో విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందుతో చాలామందికి ఆరోగ్యం మెరుగైందన్నారు. ఆనందయ్యను పదేపదే ఇబ్బందులు పెడుతుంటే.. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు.
జిల్లా అధికారులు ఆయన్ను కుటుంబసభ్యుల నుంచి దూరంగా పెట్టడం, నిర్బంధించడం విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మందును ప్రసాదంలా అందరికీ పంపిణీ చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆనందయ్యను ఎందుకు నిర్బంధిస్తున్నారో కమిషన్‌కు జవాబు చెప్పాలని, ఆయన్ను నిర్బంధించినవారిపై కమిషన్ చర్యలు తీసుకుంటుందని తల్లోజు స్పష్టం చేశారు.