ఇంటర్ బోర్డు చెప్పేది ఒకటైతే... ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు చేసేది మరొకటిగా ఉంటోంది. బోర్డు పనితీరు గాడి తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులను ఓఎస్‌డీలుగా పెట్టుకున్నా.. పనులు సకాలంలో పూర్తికావడం లేదు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులను ఏటా అయోమయంలో పడేస్తున్నారు. జులై సగం గడిచినా ఇప్పటివరకు అఫిలియేషన్ ఇవ్వకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగని గుర్తింపు పొందని కళాశాలల ప్రవేశాలను అడ్డుకున్న దాఖలాలూ లేవు. మూడేళ్ల క్రితం ఎల్‌బీనగర్‌లో ఇలాగే బోర్డు అనుమతి లేకున్నా పిల్లల్ని చేర్చుకొని ఫీజులు వసూలు చేసి హాల్‌టికెట్లు రాకపోవడంతో యాజమాన్యం పారిపోయింది. అయినా, బోర్డు మాత్రం అనుమతులపై కచ్చితమైన విధానాన్ని అమలు చేయడం లేదు.
ఆ కళాశాలల్లో చేరితే టెన్షనే..
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 1,521 కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వాటిలో 426 కళాశాలలు వాణిజ్య, గృహ సముదాయాల్లో ఉండటం వల్ల అగ్నిమాపక శాఖ నుంచి మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి. అది లేకుంటే ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వదు. మరోవైపు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి 161 కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. విద్యార్థులకు తెలియక వాటిలో చేరితే.. ఆయా యాజమాన్యాలు మోసం చేసే అవకాశాలూ లేకపోలేదు. ఇన్ని జరుగుతున్నా.. ఇంటర్ బోర్డు మాత్రం మిన్నకుండిపోతోందన్న విమర్శలున్నాయి. బోర్డు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చడం లేదు. ఏటా ఏప్రిల్/మే నాటికి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని రెండేళ్ల క్రితమే ప్రకటించినా.. అది మాటలకే పరిమితమవుతోంది. దీనిపై బోర్డు అకడమిక్ విభాగం సంయుక్త కార్యదర్శి జయమణిని వివరణ కోరగా.. శనివారం సాయంత్రం నుంచే ప్రక్రియ ప్రారంభించామని, వచ్చే కొద్ది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.