తెలంగాణ

telangana

ETV Bharat / city

40 శాతం కోర్సులు ‘స్వయం’లో చదివే వీలు!

ఇంజినీరింగ్ విద్యార్థులు ఇకపై నుంచి 40 శాతం కోర్సులు ఆన్​లైన్ వేదిక స్వయంలో చదువుకోవచ్చు. దీనిద్వారా 64 క్రెడిట్లు పొందే అవకాశం ఉందని ఏఐసీటీఈ విడుదల చేసిన నిబంధనావళి-2021లో పేర్కొంది.

40 percent courses are available in swayam website
40 శాతం కోర్సులు ‘స్వయం’లో చదివే వీలు

By

Published : Mar 9, 2021, 7:11 AM IST

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇకపై 40 శాతం కోర్సులను ఆన్‌లైన్‌ వేదిక ‘స్వయం’లో చదువుకోవచ్చు. అంటే 40 శాతం క్రెడిట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చు. ఈ మేరకు సాంకేతిక విద్యాసంస్థల అనుమతుల నియమావళి-2020లో మార్పు చేసి నిబంధనావళి-2021ను సోమవారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) విడుదల చేసింది. బీటెక్‌ నాలుగు సంవత్సరాలకు కలిపి 160 క్రెడిట్లు ఉంటాయి. మారిన నిబంధనల ప్రకారం 40 శాతం అంటే 64 క్రెడిట్లను ఆన్‌లైన్‌లో కోర్సులు పూర్తి చేసి తెచ్చుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ విధానంలో 20 శాతం అంటే 32 క్రెడిట్లకే అనుమతి ఉంది. అయినా జేఎన్‌టీయూహెచ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులను 20 క్రెడిట్లకే పరిమితం చేశారు.

వేలాది మంది ఉద్యోగాలు పోతాయా?

ఏఐసీటీఈ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలనేమీ లేదని.. ఈ నిబంధన మార్పుపై స్పందిస్తూ జేఎన్‌టీయూహెచ్‌ అకడమిక్‌ ప్లానింగ్‌ విభాగం సంచాలకురాలు మాధవీలత అన్నారు. విశ్వవిద్యాలయాలు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. 40 శాతం ఆన్‌లైన్‌ ద్వారా చదువుకోవచ్చంటే.. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వేలాది మంది ఉద్యోగాలు పోతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ మార్పు ఆహ్వానించదగినదని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్య సంఘాల నేత కేవీకే రావు చెప్పారు.

40 శాతం ఆన్‌లైన్‌ ద్వారా చదివి క్రెడిట్లను పొందే సామర్థ్యం 10 శాతం విద్యార్థుల్లో మాత్రమే ఉంటుందని స్ఫూర్తి ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

మరికొన్ని కొత్త నిబంధనలు ఇవీ..

  • ప్రథమసంవత్సరంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు భర్తీ కాకుంటే రెండో ఏడాదిలో లేటరల్‌ ఎంట్రీ (ఈసెట్‌) ద్వారా అదే కోటాలో భర్తీ చేస్తారు.
  • దూరవిద్య, ఆన్‌లైన్‌ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాలి. ఇందులో మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ట్రావెల్‌ అండ్‌ టూరిజం, కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, లాజిస్టిక్స్‌ కోర్సులకే ఏఐసీటీఈ అనుమతి ఇస్తుంది.
  • స్టూడెంట్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ కింద ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఒక సెమిస్టర్‌ అంతా ఆ సంస్థకు విద్యార్థులను పంపి చదివించవచ్చు.
  • పీజీడిప్లొమా ఇన్‌మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ కోర్సులు రెండూ ఒకే సంస్థలో నిర్వహించకూడదు.
  • ప్రతి కళాశాల.. 60 శాతం కోర్సులకు వచ్చే మూడేళ్లలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌(ఎన్‌బీఏ) అనుమతి పొందాలి.
  • డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు యూజీసీ ప్రకటించిన కేటగిరీ-1, 2లో ఉంటే మల్టీ డిసిప్లినరీ కోర్సులకు అనుమతి ఇస్తారు. అంటే బీటెక్‌లో ఇతర కోర్సుల సబ్జెక్టులు కూడా కలిపి బోధించవచ్చు. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం దీన్ని అనుమతిస్తారు.

క్రెడిట్లు అంటే...

ఒక క్రెడిట్‌ అంటే వారానికి ఒక పీరియడ్‌ చొప్పున ఒక సెమిస్టర్‌లో 14 లేదా 16 వారాలపాటు బోధించాలి. ఒక సబ్జెక్టుకు 3 క్రెడిట్లు అంటే వారానికి మూడు పీరియడ్ల చొప్పున సెమిస్టర్‌ అంతా పాఠాలు బోధించాలి. సాధారణంగా ఒక సబ్జెక్టుకు 3 లేదా 4 క్రెడిట్లు ఉంటాయి. ఆ సబ్జెక్టును పూర్తి చేయాలంటే ఎన్ని గంటల బోధన అవసరం అనేది అంచనా వేసి ఆ మేరకు వీటిని నిర్ణయిస్తారు. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఒక బీటెక్‌ విద్యార్థి ఉత్తీర్ణుడైతే మొత్తం 160 క్రెడిట్లు సాధించినట్లు లెక్క. ఒక సబ్జెక్టు తప్పితే 3 లేదా 4 క్రెడిట్లు కోల్పోతారు. మొత్తానికి క్రెడిట్‌ అంటే సిలబస్‌ వెయిటేజీకి సంబంధించినది మాత్రమే. వాటి ఆధారంగా ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? క్యుమిలేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(సీజీపీఏ) ఎంత దక్కింది? అన్నది చెప్పలేం. ఒక విద్యార్థి 40 శాతం, మరో విద్యార్థి 90 శాతం మార్కులతో పాసైనా.. వారిద్దరూ 160 క్రెడిట్లు సాధించినట్లే లెక్క. అన్నిలేకుంటే తప్పినట్లు. స్వయం పోర్టల్‌లో ఒక్కో కోర్సు సిలబస్‌ను బట్టి 2 నుంచి 4 క్రెడిట్లు ఇస్తుంటారు. విద్యార్థులు వాటిని ఎంచుకొని పాసైతే ఆ మొత్తం పొందుతారు. లేకుంటే ఒక్క క్రెడిట్‌ కూడా రాదు.

ABOUT THE AUTHOR

...view details