రాబోయే దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికతో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల నియోజక వర్గాల మండలి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ హామీ ఇచ్చారు పార్టీ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలిసి కట్టుగా పనిచేయాలని..క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని ఉపేక్షించకూడదని కూడా పలువురు నాయకులు ఇంఛార్జ్‌కు సూచించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జ్‌లతో జూమ్ ద్వారా సమావేశమైన ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు.
సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి, మాజీ మంత్రులు గీతా రెడ్డిలతోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మొదట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌కు నాయకులను పరిచయం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు నాయకులు రాష్ట్ర ఇంఛార్జ్ దృష్టికి తెచ్చారు. తెలంగాణ వచ్చాక, ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ లబ్ధి పొందలేదని వివరించారు.