రైతుబంధు పథకంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎంత సొమ్ము పొందారనే వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం కుదరదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. కమతాల విస్తీర్ణం వారీగా రైతుల వివరాలు ఇవ్వడానికి కూడా తిరస్కరించింది. ఈ వివరాల కోసం హైదరాబాద్‌కు చెందిన జలగం సుధీర్ అనే వ్యక్తి సహ చట్టం కింద వ్యవసాయశాఖ ‘ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు చేశారు. మొత్తం 15 ప్రశ్నలకు సమాచారం అడిగితే చాలావాటికి ఇవ్వడం కుదరదని చెప్పి కొన్నింటికి మాత్రం అదీ అసమగ్రంగా ఇచ్చింది.
ఇవి అడిగినవి
ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబ సభ్యుల్లో ఈ పథకం కింద ఎంత సొమ్ము అందింది, వారి భూముల వివరాలేంటి? వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లలో ఎవరికి ఇచ్చారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నవారికి ఎందరికిచ్చారు, కంపెనీల పేరుతో ఉన్న భూములకు ఎంత ఇచ్చారు, వాటి పేర్లేమిటి? 5 ఎకరాలకన్నా ఎక్కువ ఉన్న రైతులెందరు, 10, 20, 50, 100 ఎకరాలకన్నా ఎక్కువ భూమి ఉన్నవారెందరు ఈ సొమ్ము తీసుకున్నారనే వివరాలను అడగ్గా వాటిని ఇవ్వడానికి వ్యవసాయశాఖ నిరాకరించింది.