దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ వైఫై ఉన్న నగరం హైదరాబాదేనని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యాక్ట్ ఫైబర్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం హై-ఫై పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో 3000 పబ్లిక్ హాట్ స్పాట్లు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కేటీర్ హాజరయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో హై-ఫై ద్వారా కనెక్ట్ అయి ఉన్న వారితో కేటీఆర్... సరదాగా కాసేపు మాట్లాడారు. తనదైనశైలిలో పంచులతో యువకులతో ముచ్చటించారు. తన బిజీ లైఫ్‌పై కుటుంబసభ్యులు వేసే జోకులను పంచుకున్నారు.
హైఫైని విస్తరించేందుకు ఆలోచన...
"డిజిటల్ విధానాల్లో అన్ని రకాల సమాచారాన్ని పొందుతున్న ప్రస్తుత ప్రపంచంలో డిజిటల్ విభజన అనేది మునుపెన్నడు లేనంతగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. హైఫై కార్యక్రమాన్ని మరింత విస్తరించి ప్రజలుకు ఏ విధంగా సహాయం చేయొచ్చు అన్న దానిపై ఆలోచన చేస్తున్నాం. అతి తక్కువ సమయంలోనే ఈ హైఫై కార్యక్రమాన్ని సుసాధ్యం చేసిన యాక్ట్ బృందానికి నా కృతజ్ఞతలు. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ వైఫై నగరంగా చెప్పటం ఆనందంగా ఉంది. కానీ...ఆరవింద్ కేజ్రీవాల్ ఒప్పుకోడనుకుంటా. ప్రస్తుతం ఉన్న రోజుల్లో కుటుంబసభ్యులం కూడా మాట్లాడుకోలేనంత బిజీ అయిపోయాం. మా ఫ్యామిలిలో కూడా కొన్ని జోకులేసుకుంటాం. ఓ రోజు నా కొడుకు నాకు కాల్ చేశాడు. కానీ ఆ రోజు మొత్తం బిజీగా ఉండటం వల్ల తన కాల్స్‌ని అటెండ్ చేయలేకపోయాను. తర్వాత చూసుకుని.. ఎందుకు కాల్ చేశావని అడిగితే.. 'ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడను. మాట్లాడాలనుకుంటే ట్విట్టర్లోనే మాట్లాడతా'అన్నాడు. " -కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వైద్యారోగ్య సదుపాయాలను అనుసంధానించి ఈ-హెల్త్, టెలిమెడిసిన్ లాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర నగరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ... ఇక్కడున్న ప్రభుత్వ విధానం వల్ల త్వరగా ఈ మైలురాయిని సాధించామని యాక్ట్ ఫైబర్ సీఈఓ బాలా మల్లాది తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు హిమాన్షు ఎప్పుడు కాల్ చేయనన్నాడటా.. దాని ద్వారానే మాట్లాడతాడట..! ఇవీ చూడండి: