తెలంగాణ

telangana

ETV Bharat / city

Bonalu: అంబరాన్నంటే సంబురం.. బోనాల ఉత్సవం - bonalu festival in Hyderabad

చెట్టు.. పుట్ట.. పువ్వు.. రాయి రాప్పల్లో దైవత్వాన్ని చూసే తెలంగాణ సంస్కృతిలో బోనాలది విశిష్టస్థానం. అచ్చమైన తెలంగాణ సంప్రదాయానికి కట్టిన పచ్చనితోరణం.. బోనాల పండుగ. బోనం అంటే బువ్వ. శక్తి సమన్వితమైన ప్రకృతిని దైవంగా భావిస్తూ.. ఆషాడమాసంలో తొలకరి జల్లుల వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతల్లీ అంటూ ఆ జగన్మాతకు మొక్కులు చెల్లిస్తాం. అమ్మవారిని అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి ఫలహారాలు, పంచభక్షపరమాన్నాలు, ఒడిబియ్యం, సారె ఇచ్చి మళ్లీ అత్తవారింటికి సాగనంపుతాం.

Bonala festival
బోనాల ఉత్సవం

By

Published : Jul 10, 2021, 3:50 PM IST

ఆషాఢంలో బోనాల్ని సమర్పించడమంటే, అమ్మ కటాక్షంతో దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడం. ఆషాడమాసంలో జంటనగరాల్లో బోనాల సందడి అంతాఇంతా కాదు. పిల్లాపెద్దా అంతా కలిసి ఆనందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్​లోని ఉజ్జయినీ మహంకాళి జాతరతో ఈ సంబురం అంబరాన్నంటుతుంది.

గోల్కొండలో షురూ..

ప్రతిఏటా గోల్కొండ జగదాంబికా ఆలయంలో ప్రారంభమయ్యే బోనాల సంబురం, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ అక్కన్న, మాదన్న మహంకాళీ, లాల్‌ దర్వాజ మహంకాళీ దేవాలయాల్లో మొత్తం 14 ప్రధాన అమ్మవార్ల దేవాలయాల్లో కన్నులపండువగా జరుగుతాయి.

ఘటోత్సవం..

కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి అత్తింటి నుంచి పుట్టింటికి ఎదుర్కోని రావడమే ఘటోత్సవం. మంగళవాద్యాలు, భక్తుల నృత్యాల నడుమ వైభవంగా అమ్మవారికి స్వాగతం పలుకుతారు.

పోతరాజు..

ఈ పండుగలో ప్రత్యేకమైనది.. పోతరాజు వేషం. ఒళ్లంతా పసుపు పూసుకుని, ఎర్ర ధోతి కట్టుకుని, చేతిలో కొరఢా పట్టుకుని, కాళ్లకు గజ్జెలు, మెడలో పూలదండ వేసుకుని డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా చిందులేస్తూ బోనాల ముందు కదిలివస్తాడు. పోతరాజుతో చిన్నాపెద్దా అంతా కలిసి నృత్యాలు చేస్తారు. పిల్లలంతా ఎంతో సంబురంగా కేరింతలు కొడుతుంటారు.

అమ్మకు నివేదన..

వేపకొమ్మల్ని పసుపునీటిలో ముంచి ఆ నీరు అమ్మవారికి సమర్పించటాన్ని శాకమిచ్చుట .. బెల్లంతో తయారు చేసిన మధురమైన భోజనాన్ని శక్తికి నివేదించడాన్ని పాకమిచ్చుట అంటారు. అమ్మకు ఇష్టమైన ఆహారాన్ని వండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆమెకు నివేదిస్తారు. అనంతరం ప్రసాదంగా అందరికి పంచిపెడతారు.

రంగం..

బోనాల పండుగ తరువాత రోజు ఉదయం అమ్మవారిని ఆవహించిన అవివాహిత స్త్రీ భవిష్యవాణి వినిపిస్తుంది. భవిష్యత్​లో జరిగే విషయాలను అమ్మవారి మాటగా పలుకుతుంది. ప్రతి ఆలయంలో వీరు ఉంటారు. బోనాల సంబురానికి ప్రధాన ఆకర్షణ ఈ రంగం.

నిండు మనసుతో.. అమ్మకు నివేదన

అమ్మవారిని ఊరేగిస్తూ అత్తింటికి సాగనంపడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఒక్కోప్రాంతంలో ఒక్కో రూపంలో అమ్మను పూజిస్తారు. వ్యాధుల నుంచి కాపాడమని.. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్నివ్వమని నిండు మనసుతో అమ్మకు మొక్కుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details