తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఒక్కరోజులోనే 50.84లక్షల మందికి రైతుబంధు ఇచ్చాం'

అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కరోనా విపత్తు సమయంలోనూ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని మొదటి పథకం రైతుబంధని.. కేసీఆర్ దూరదృష్టితోనే ఈ పథకం సాధ్యమయిందన్నారు.

niranjan reddy
niranjan reddy

By

Published : Jun 22, 2020, 10:04 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రికార్డు సమయంలో ఒకే రోజు 50.84లక్షల మంది రైతులకు రూ.5294.53 కోట్లు ఖాతాలలో జమ చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి గంటకు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు వేసినట్లు మంత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా విపత్తులోనూ అందించాం

ఆర్‌ఓఎఫ్‌ఆర్ (ఏజెన్సీ) పట్టాదారులకు చెందిన 63,477 మంది రైతులకు సంబంధించిన రూ.82.37 కోట్లు ఖాతాల్లో జమ చేశాం. ఈ నెల జూన్ 16 వరకు పాస్ బుక్‌లు వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తిస్తుంది. ఇంకా బ్యాంకు వివరాలు ఇవ్వని 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏఈఓలకు వివరాలు అందగానే ఖాతాలలో నిధులు జమచేయాలని అధికారులను ఆదేశించాం. కరోనా విపత్తులోనూ రైతులకు రైతుబంధు నిధులు అందిస్తున్నాం.

-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే...

రెండు సీజన్ల రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని... ఇది తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలకు తార్కాణమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికే ఆదర్శం, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు సోపానంగా ఆయన వివరించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని మొదటి పథకం రైతుబంధు అని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్టితోనే ఈ పథకం సాధ్యమయిందన్నారు. రైతుబంధు నిధుల జమకోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఎన్ఐసీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి : గూగుల్​ పే కస్టమర్​ కేర్​ పేరుతో మోసం

ABOUT THE AUTHOR

...view details