రాష్ట్రంలో కరోనా కేసుల నానాటికి సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 43 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 272కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 228 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని ప్రభుత్వం తెలిపింది.
మర్కజ్ ప్రభావం..
ఇటీవల నమోదైన పాజిటివ్ కేసులు అన్ని మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారిని కలిసిన వారివేనని ప్రభుత్వం పేర్కొంది. షాద్నగర్లో, సికింద్రాబాద్లో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారు కూడా.. దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తులను కలిసిన వారేనని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్ నుంచి 1090 మంది వచ్చారని... వాళ్లందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.