ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడాన్ని తప్పుపడుతూ నిన్న ట్యాంక్ బండ్ వద్ద మందకృష్ణ మాదిగ ఆందోళన చేపట్టారు. ఇందిరాపార్క్- ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమానికి అనుమతి కోరారు. అందుకు నిరాకరించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అంబర్పేట్లోని ఆయనను గృహ నిర్బంధం చేశారు.
పోలీసుల చర్యలపై మందకృష్ణ తీవ్రంగా స్పందించారు. అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. ఇప్పటికి ఐదేళ్లు గడుస్తున్నా... ఒక్కసారైన కేసీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారా అని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా బడుగులను అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. తెరాస అధినేతగా కూడా కేసీఆర్ అంబేడ్కర్ ఉత్సవాల్లో పాల్గొనలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకూ అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు.