ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైన ఏర్పడిన గుంతల్లో వరద నీరు చేరి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. జోరువానల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే 18004251939 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. జిల్లాలోని వర్షాల పరిస్థితిపై తహసీల్దార్, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 14.3 మీమీ వర్షం కురవాల్సి ఉండగా 31.3 మీమీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తుంతుంగ వాడు పొంగిపొర్లుతోంది. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని 11 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చెన్నూరు మండలంలోని సుద్దాలవాగు పొంగిపొర్లుతుండడం వల్ల 5 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మందమర్రి పట్టణంలోని యాపల్ ప్రాంతంలో మిట్టపల్లి బాబు అనే వ్యక్తి ఇంటి గోడ రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టు పూర్తిగా నిండి మత్తడి పోస్తోంది. ముల్కలపేట, కేతనపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. వేమనపల్లి , నాగరం మధ్య వాగు ఉప్పొంగుతుండడం వల్ల బెల్లంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. గొర్లపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
కన్నెపల్లి మండలంలో వీరాపూర్, ఎర్రవాగు ప్రాజెక్టులు నిండాయి. లింగాల గ్రామంలో ఆల్కారి జయ అనే రైతు ఇల్లు వర్షానికి కూలిపోయింది. భీమిని మండలంలో తంగళ్లపల్లి, వెంకటాపూర్ గ్రామాల మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. 148 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి 145.98 మీటర్ల ఎత్తుకు వరద నీరు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 14.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 8,541 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. 5,521 క్యూసెక్కుల నీటిని నంది పంప్ హౌజ్, హైదరాబాద్ వాటర్ బోర్డ్, రామగుండం ఎన్టీపీసీకి తరలిస్తున్నారు. సుందిళ్ల పార్వతి జలాశయం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 5,765 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు.
జైపూర్ మండలంలో పెగడపల్లి వాగు ఉప్పొంగుతోంది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిట్టపల్లి వాగు ఉప్పొంగింది. కోటపల్లి మండలం అర్జున బుట్టలో ప్రాణహిత నది నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.