Xiaomi Allegations: చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ ఇండియా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై సంచలన ఆరోపణలు చేసింది. భారత విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై దర్యాప్తు సమయంలో తమ ప్రతినిధులపై ఈడీ అధికారులు 'భౌతిక దాడి'కి దిగారని కోర్టుకు నివేదించింది. ఇటీవల షియోమీకి చెందిన రూ.5,551 కోట్లను ఈడీ జప్తు విధించింది. అయితే, ఈ జప్తును గురువారం ఓ కోర్టు ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.
ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (షియోమీ ఇండియాగానూ పిలుస్తారు), ఎమ్‌ఐ బ్రాండ్ మొబైల్ ఫోన్లకు భారత్‌లో ట్రేడర్, పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. ‘చైనాకు చెందిన షియోమీ గ్రూప్ అనుబంధ సంస్థ షియోమీ ఇండియా బ్యాంకు ఖాతాల్లోని రూ.5,551.27 కోట్లను జప్తు చేసిన’ట్లు ఏప్రిల్ 30న ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై షియోమీ కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి ప్రస్తుతానికి జప్తును నిలిపివేశారు.
ఈ విషయంలో ఫిబ్రవరి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతోంది. అందులో భాగంగా పలువురు షియోమీ ఇండియా ప్రతినిధుల్ని ఈడీ ప్రశ్నించింది. విచారణ సమయంలో తమ మాజీ ఎండీ మను కుమార్ జైన్, ప్రస్తుత సీఎఫ్‌ఓ సమీర్ బి.ఎస్.రావును ఈడీ అధికారులు బెదిరించారని షియోమీ తాజాగా ఆరోపించింది. తాము చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు చెప్పుకొచ్చింది. అరెస్టులు, భౌతిక దాడులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ ఒత్తిడిని కొంతకాలం తమ ప్రతినిధులు భరించారని తెలిపింది. కానీ, చివరకు తలొగ్గి కొన్ని విషయాల్లో వారికి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది.