తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 11:41 AM IST

ETV Bharat / business

మీ లోన్​ అప్లికేషన్​ తరచూ రిజెక్ట్​ అవుతోందా? ఏం చేయాలో తెలుసా?

What To Do If Loan Application Is Rejected : బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం అన్ని సందర్భాల్లోనూ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకు రుణ దరఖాస్తును తిరస్కరిస్తుంటుంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలి? చూద్దాం.

What Are The Reasons For Loan Rejection In Telugu
Reasons For Loan Rejection

What To Do If Loan Application Is Rejected : రుణం- ప్రతిఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తీసుకోక తప్పదు. ఇవి మన అత్యవసర ఆర్థిక అవసరాలతో పాటు మన విలాసవంతమైన అవసరాలను తీరుస్తుంటాయి. అయితే ఇందుకోసం చాలామంది ఎక్కువగా బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. అలా అని వెళ్లగానే బ్యాంకులు రుణాలు ఇచ్చేస్తాయి అనుకుంటే పొరపాటే. ఒక్క లోన్​ మంజూరుకు అనేక కొర్రీలు పెడుతుంటాయి బ్యాంకులు. ఇందుకు ప్రభుత్వ బ్యాంకులేమీ అతీతం కాదు. ఈ నేపథ్యంలో అన్ని పత్రాలతో రుణం కోసం బ్యాంకుకు వెళ్లినా ఒక్కోసారి మన లోన్​ అప్లికేషన్​లను సదరు బ్యాంకులు తిరస్కరిస్తుంటాయి. మరి అలా ఎందుకు జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో రుణగ్రహీతలు ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

తిరస్కరణకు అనేక కారణాలు
మీ రుణ దరఖాస్తును బ్యాంకులు తిరస్కరించడానికి అనేక కారణాలుంటాయి. అంతకుముందు తీసుకున్న రుణాల చెల్లింపుల తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందుకు కారణం కావచ్చు. ఇదిలా ఉంటే, ఒకవేళ ఇటీవలే మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, మళ్లీ కొత్త రుణం దరఖాస్తు వెళ్లేముందు రుణగ్రహీతలు సరిచూసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవేంటంటే

అడిగి తెలుసుకోండి
బ్యాంకులో మీ లోన్​ అప్లికేషన్​ ఎందుకు రిజెక్ట్​ అయిందో అనే కారణాన్ని అడిగి తెలుసుకోండి. క్రెడిట్‌ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు మీ రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించకపోవచ్చు. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. అంతేకాకుండా మీ క్రెడిట్‌ రిపోర్ట్​లో తప్పుడు వివరాలు కూడా అప్పుడప్పడు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు.

ఆ విషయంలో జాగ్రత్త
మీరు చేసుకునే రుణాల దరఖాస్తులు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే ముందుగా ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం అలవాటు చేసుకోండి. వాయిదాలను సకాలంలో చెల్లించండి. 750కి మించి క్రెడిట్‌ స్కోర్​ ఉంటే మీ రుణ దరఖాస్తును బ్యాంకులు సులభంగా ఆమోదిస్తాయి. తక్కువ క్రెడిట్​ స్కోరు వల్లే రుణం తిరస్కణ జరుగుతుందనుకుంటే ముందుగా దానిని పెంచుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న అప్పులను పూర్తిగా చెల్లించేలా చూసుకోండి. దీంతో మీ క్రెడిట్‌ స్కోరు క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి సూత్రాన్ని పాటించండి. మీ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు ఇప్పటికే ఉన్న క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని పరిమితం చేయండి. కొత్త కార్డుల జోలికి కొన్నాళ్లు వెళ్లకపోవడమే ఉత్తమం.

ముందుగానే సరిచూసుకోండి
రుణ దరఖాస్తు చేసేటప్పుడు మీ వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్‌, ఆధార్‌ సహా ఇతర వివరాలను జత చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ రుణదాతలకు సంబంధించిన యాప్‌లోనే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా, మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. అందుకని ముందుగానే ఈ వివరాలను సరిచూసుకోండి.

ఎంత తక్కువ చేస్తే అంత మంచిది
కొందరు అవసరం లేకపోయినా పర్సనల్​, కొత్త క్రెడిట్‌ కార్డుల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఇలా చేస్తే ప్రతిసారీ మీ క్రెడిట్‌ స్కోరు స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అందుకని తక్కువ సమయంలోనే అనేక రుణ దరఖాస్తులు మీ క్రెడిట్‌ స్కోరును గణనీయంగా తగ్గిస్తాయి. మీ క్రెడిట్​ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకు తక్కువ దరఖాస్తులు చేయడం మంచిది. అనేకసార్లు దరఖాస్తు చేస్తే, మీరు అప్పుల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే ప్రమాదం ఉంది. ఇది మీపై ప్రతికూల అభిప్రాయాన్ని తెచ్చిపెట్టవచ్చు.

ఎప్పటికప్పుడు చేసుకోవాలి
క్రెడిట్‌ రిపోర్ట్​లో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. అందుకని క్రెడిట్‌ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మేలు. కొన్ని క్రెడిట్‌ బ్యూరోలు ఈ సమాచారాన్ని నెలకోసారి ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, దానిని పెంచుకునేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బాకీల్లాంటివి సకాలంలో చెల్లించండి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి.

అంత మించకుండా చూసుకోండి
మీరు ఇప్పటికే తీసుకున్న రుణాలకు వాయిదాలు మీ ఆదాయంలో ఎంత మేరకు ఉన్నాయనేది ప్రధానంగా రుణదాతలు లేదా బ్యాంకులు పరిశీలిస్తాయి. మీ ఆదాయంలో 30-40 శాతానికి మించి వాయిదాలకు చెల్లింపులు ఉండకూడదు. ప్రస్తుతం చెల్లిస్తున్న వాయిదాల మొత్తం ఇంతకన్నా ఎక్కువగా ఉంటే, కొత్త రుణం మంజూరు కావడం సాధ్యం కాకపోవచ్చు.

రోజుకు 2జీబీ డేటా, అన్​లిమిటెడ్ కాల్స్​- ఏ నెట్​వర్క్​ ప్లాన్​ బెస్ట్​?

PF డబ్బులు తీయాలా? - ఇలా చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది!

ABOUT THE AUTHOR

...view details