Loan Default: రుణాలు తీసుకునే వారు గడువు తేదీలోపు ఈఎంఐ చెల్లించడం అలవాటుగా మార్చుకోవాలి. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈఎంఐ చెల్లింపును ఆలస్యం చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ప్రతికూలకంగా మారుతుంది. రుణాన్ని బట్టి జరిమానా వసూళ్లు ఉంటాయి. ఈఎంఐ ఆలస్యం అయినప్పుడు బ్యాంకులు సాధారణ వడ్డీతో పాటు జరిమానా కూడా విధిస్తాయి. ఆ జరిమానాకి జీఎస్‌టీ కూడా తోడవుతుంది. ఇంతకీ ఈఎంఐల చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం..
జరిమానా ఎప్పుడు విధిస్తారు?
ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు ఈఎంఐని ఆలస్యం చేస్తే, బ్యాంకుకు మీరు చెల్లించే మొత్తానికి లోబడి వాయిదాపై 1% నుంచి 2% వరకు జరిమానా చెల్లించాలి. రుణాన్ని బట్టి జరిమానా మారొచ్చు.
నాన్-పెర్పార్మింగ్ అసెట్ (NPA)గా ఎప్పుడు నిర్ధారిస్తారు?
బ్యాంకులు ఈఎంఐ డిఫాల్ట్‌ని 2 భాగాలుగా వర్గీకరిస్తాయి - మైనర్ డిఫాల్ట్, మేజర్ డిఫాల్ట్. 90 రోజుల వరకు ఈఎంఐ ఆలస్యం మైనర్ డిఫాల్ట్ కేటగిరీ కిందకు వస్తుంది. వరుసగా 3 ఈఎంఐలు తప్పడం మేజర్ డిఫాల్ట్. మైనర్ డిఫాల్ట్ విషయంలో బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. రుణ ఈఎంఐల గురించి తెలుపుతూ రిమైండర్ నోటీసులు పంపుతాయి. అంతేగాక ఈఎంఐ చెల్లింపు ఆలస్యాన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాయి.
90 రోజులపైబడి అసలు లేదా వడ్డీ చెల్లించని పెద్ద డిఫాల్ట్ విషయంలో బ్యాంక్ మీ రుణాన్ని నాన్-పెర్పార్మింగ్ అసెట్ (NPA)గా పరిగణించి.. రికవరీ విధానాన్ని ప్రారంభించవచ్చు. మీ రుణాన్ని ఎన్పీఏ గుర్తించే ముందు బ్యాంకు మీకు నోటీసు పంపుతుంది. నోటీసులో పేర్కొన్న గడువులోపు మీరు అవసరమైన మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, మీ రుణాన్ని ఎన్పీఏ గా మార్చకుండా నివారించవచ్చు.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం!
మీ క్రెడిట్ నివేదికలో చెల్లింపు జాప్యం నమోదవుతుంది. రుణాన్ని బట్టి ఇతర అంశాల ఆధారంగా ఒక్క ఈఎంఐని కోల్పోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దాదాపు 50 పాయింట్లు తగ్గుతుంది. ఈఎంఐని మళ్లీ కచ్చితంగా చెల్లించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ క్రమంగా మెరుగుపడుతుంది. మీ రుణాన్నిఎన్పీఏ గా వర్గీకరించినట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా దెబ్బతీస్తుంది. మీ క్రెడిట్ నివేదికలో నమోదవుతుంది. భవిష్యత్తులో కొత్త రుణం తీసుకునేటప్పుడు మీ ఆర్థిక సామర్ధ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ఎన్పీఏ(NPA) విషయంలో బ్యాంకు ఏమైనా సెటిల్‌మెంట్ చేస్తుందా?
బకాయిగా ఉన్న రుణాన్ని ఎన్పీఏగా ప్రకటించిన తర్వాత.. వడ్డీ, జరిమానాలతో సహా మొత్తం బకాయిని తిరిగి వసూలు చేసుకోవడానికి, బ్యాంకు రుణాన్ని సెటిల్ చేయడానికి మీకు ఎంపికలను ఇవ్వవచ్చు. రుణ సెటిల్‌మెంట్స్ ఆర్థికంగా తేలికంగా అనిపించవచ్చు. కానీ అవి మీ క్రెడిట్ యోగ్యతపై దీర్ఘకాలిక మచ్చని మిగులుస్తాయి. మీ క్రెడిట్ రిపోర్ట్‌లో మీకు 'రుణ సెటిల్‌మెంట్' ఉంటే భవిష్యత్తులో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మొగ్గు చూపవు. కాబట్టి, మీ రుణం ఎన్పీఏగా గుర్తించినా లేదా ఎన్పీఏగా మారే దశలో ఉన్నట్లయితే బ్యాంకు నుంచి సమయ పొడిగింపు లేదా రుణ పునర్నిర్మాణాన్ని (లోన్ రీస్ట్రక్చరింగ్) పొందడానికి ప్రయత్నించండి.
ఈఎంఐ చెల్లింపులో జాప్యాన్ని ఎలా నివారించాలి?
మీ రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికను చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. మీ రుణాన్ని ఎన్పీఏగా మార్చడానికి బదులుగా, మీకు ఉన్న పెట్టుబడులలో కొన్నింటిని లిక్విడేట్ చేసి రుణాలను తీర్చవచ్చు. ఇటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అత్యవసర నిధిని కలిగి ఉండటం చాలా అవసరం. కొన్ని సార్లు బ్యాంకు మీకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి సమయం ఇవ్వడం, రుణ పునర్నిర్మాణం మొదలైన సడలింపులను ఇవ్వవచ్చు. ఒకే సమయంలో ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండండి. ఒక రుణాన్ని తీర్చడానికి ఇంకొక రుణం తీసుకోవద్దు. ఇది రుణ ఉచ్చుకు దారితీస్తుంది. ఈఎంఐని తిరిగి చెల్లించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీ రుణాన్ని ఎన్పీఏ వర్గీకరించకుండా ఉండేందుకు మీరు కనీసం వడ్డీని కూడా చెల్లించవచ్చు.
ఇవీ చదవండి:ఒక్కసారి ఛార్జింగ్‌తో 500కిమీ జర్నీ, ఓలా కార్ ఫీచర్స్ ఇవే
ఇక మినహాయింపులు లేకుండా కొత్త ఆదాయపు పన్ను విధానం