Vehicle Insurance Renewal Tips :భారతీయ చట్టాల ప్రకారం ప్రతి వాహనానికీ బీమా తప్పనిసరి. సాధారణంగా వాహన బీమాలో.. కాంప్రిహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనే రెండు రకాలుంటాయి. రోడ్డుపైన వాహనం తిరగాలంటే కచ్చితంగా థర్ట్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. అందుకే గడువు ముగిసిన వెంటనే పాలసీని కచ్చితంగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. (Vehicle Insurance Renewal). అయితే వాహన బీమా పాలసీని రెన్యువల్ చేసే సమయంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలను గుర్తుంచుకోవాలి! అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బేరమాడితే తప్పేం కాదు..
వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునే సమయంలో.. కంపెనీవారు చెప్పిన ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి పాలసీని కోరుతూనే.. ప్రీమియాన్ని తగ్గించమని కోరే వెసులుబాటు కస్టమర్లకు ఉంటుంది. వాహనం తీసుకొని ఎన్నేళ్లు అవుతోంది? మార్కెట్‌లో ప్రస్తుతం దాని విలువ ఎంత? ప్రస్తుతం వాహనం ఉన్న కండిషన్‌ను అనుసరించి ప్రీమియంను నిర్ధరిస్తుంటారు. ఒక వేళ మీ వాహనంలో ఏ లోపాలూ లేవని భావిస్తే.. కచ్చితంగా ప్రీమియం తగ్గించమని కోరవచ్చు. వారు మీ బండిని సమగ్రంగా పరిశీలించి.. నిబంధనల మేరకు ప్రీమియం అమౌంట్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది.
కొత్త బండికి.. సమగ్ర పాలసీ..
Comprehensive Vehicle Insurance : వాహనం కొత్తదైతే.. సమగ్ర పాలసీ తీసుకోవడం మేలు. దీంట్లో ఓన్ డ్యామేజ్‌తో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. వాహనం మరీ పాతదైతే ‘ఓన్ డ్యామేజ్’ను తీసుకోకపోయినా ఫరవాలేదని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ప్రీమియంపై కొంత మేరకు ఆదా చేసుకునే వీలుంటుంది. ఓన్ డ్యామేజ్‌ను వదులుకోవడం అనేది మీరు వాహనం నడిపే తీరు, వాహనం విలువ, మీ ఆర్థిక స్తోమత ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
ముందే పునరుద్ధరించాలి..
Vehicle Insurance Renewal After Expiry : సాధారణంగా గడువు ముగియడానికి ముందే వాహన బీమా పాలసీని పునరుద్ధరించడం ఉత్తమమని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రీమియంలో కొంత మేరకు రాయితీ లేదా ఆఫర్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే నో-క్లెయిం-బోనస్ కూడా పొందవచ్చు. గడువు ముగిస్తే దీన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
యూసేజ్ ఆధారిత పాలసీలు..
Vehicle Insurance Based On Usage : కొన్ని బీమా సంస్థలు యూసేజ్ ఆధారిత పాలసీలను అందిస్తున్నాయి. అంటే మన వాహన వినియోగాన్ని అనుసరించి పాలసీలను నిర్ధరిస్తారు. డ్రైవింగ్ బిహేవియర్, మైలేజ్, ఇప్పటి వరకు వాహనం ప్రయాణించిన దూరం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పాలసీని అందిస్తారు. ప్రీమియం కూడా అందుకు అనుగుణంగానే మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు తరచుగా వాహనాన్ని బయటకు తీసే అవసరం లేకపోతే.. ఇటువంటి పాలసీలను పరిశీలించవచ్చు. ఫలితంగా మీపై ప్రీమియం భారం తగ్గుతుంది.