Vehicle Insurance Renewal Guidelines :వాహనం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆ వెహికిల్‌కు తప్పనిసరిగా బీమా చేయించాలి. ఈ బీమాల్లో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి సమగ్ర (Comprehensive) బీమా అయితే మరొకటి థర్డ్ పార్టీ బీమా. వాహనం రోడ్డుపై తిరగాలంటే కనీసం థర్ట్ పార్టీ బీమా అయినా ఉండి తీరాలి. అదే విధంగా గడువు ముగిసిన పాలసీని వెంటనే రెన్యూవల్ చేసుకోవాలి. కాకపోతే పాలసీని రెన్యూవల్ చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బేరమాడాల్సిందే..
వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకునేటప్పుడు బీమా సంస్థలు ఎంత చెప్పితే అంత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి పాలసీని కోరుతూనే.. ప్రీమియాన్ని తగ్గించమని అడగాలి. మీకు ఆ వెసులుబాటు ఉంది. వాహనం కొనుగోలు చేసి ఎన్ని రోజులు అవుతోంది? దాని మార్కెట్ విలువ ఎంత? వాహన కండిషన్ లాంటి ఇతర అంశాల ఆధారంగా ప్రీమియంను నిర్ధరిస్తాయి బీమా కంపెనీలు. మీ వాహనంలో ఎటువంటి లోపాలూ లేనట్లయితే.. ప్రీమియంను తగ్గించమని మీరు బీమా సంస్థను కోరవచ్చు. అప్పుడు వారు వాహనాన్ని పూర్తిగా పరిశీలించి నిబంధనల మేరకు ప్రీమియం తగ్గించే అవకాశం ఉంటుంది.
కొత్తదైతే సమగ్ర పాలసీ మేలు..
కొత్తగా వాహనం కొనుగోలు చేసినప్పుడు సమగ్ర పాలసీ తీసుకోవడం మంచిది. ఈ పాలసీలో ఓన్ డ్యామేజ్‌తో పాటు థర్డ్ పార్టీ కూడా కవరేజ్‌లోకి వస్తుంది. వాహనం మరీ పాతదైతే మాత్రం 'ఓన్ డ్యామేజ్'ను తీసుకోకపోయినా పెద్దగా ప్రభావం ఉండదు. దీంతో ప్రీమియంపై కొంత వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. మీరు వాహనం నడిపే తీరు, వాహనం విలువ, మీ ఆర్థిక స్తోమత ఆధారంగా ఓన్ డ్యామేజ్‌ను వదులుకోవడం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.
ముందే పునరుద్ధరించాలి..
గడువు తేది కంటే ముందే పాలసీని రెన్యూవల్ చేయడం మంచిదని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ప్రీమియంలో కొంత మేరకు రాయితీ, లేదా ఆఫర్లు పొందే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దాంతోపాటు నో-క్లెయిం-బోనస్ కూడా పొందొచ్చని అంటున్నారు. రెన్యూవల్ గడువు ముగిస్తే వీటిని వదులుకోవాల్సి ఉంటుంది. కనుక పాలసీని ముందే రెన్యూవల్ చేసుకోవడం ఉత్తమం.
యూసేజ్ ఆధారిత పాలసీలు..
మీరు తరచుగా వాహనాన్ని బయటకు తీసే అవసరం లేకపోతే.. ఈ తరహా పాలసీలను పరిశీలించవచ్చు. ఈ రకం పాలసీలలో ప్రీమియం భారం కొంతమేరకు తక్కువగా ఉంటుంది. యూసేజ్ ఆధారిత పాలసీలో వాహన వినియోగం ఆధారంగా ప్రీమియాన్ని నిర్థరిస్తారు. డ్రైవింగ్ బిహేవియర్, మైలేజ్, ఇప్పటి వరకు వాహనం ప్రయాణించిన దూరం.. తదితర అంశాలను బేరీజు వేసుకుని పాలసీని అందిస్తారు. ప్రీమియం కూడా అందుకు అనుగుణంగానే మారుతుంటుంది.