Financial Health: రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతామో.. దాన్ని సరైన విధంగా వినియోగించడానికీ అంతే శ్రమించాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సులువుగా సాధించేందుకు వీలవుతుంది. లేకపోతే.. ఖర్చులు పెరిగి, సంపాదన సరిపోక.. అప్పుల భారం మోయాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
సంపాదించిన మొత్తం అంతా ఖర్చు చేస్తే.. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాల్సిందే. పొదుపు జీవితంలో ఊహించని ఖర్చుల నుంచి కాపాడుతుంది. తగిన మొత్తం చేతిలో ఉంటే.. ఆకస్మికంగా ఏదైనా అవసరం వస్తే.. మీ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కూడబెట్టిన మొత్తం నుంచి డబ్బును తీయక్కర్లేదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరమూ తప్పుతుంది. చాలామంది వ్యయాలను ఎలా నిర్వహించాలో తెలియకే ఆర్థికంగా చిక్కుల్లో పడుతుంటారు. సాధారణ నియమంగా మీ మూడు నెలల స్థూల వేతనం మీ పొదుపు ఖాతాలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు.. అత్యవసరంగా కారు లేదా ఇంటి మరమ్మతు చేయడానికి ఇది అవసరం పడొచ్చు. ఏదైనా ప్రమాదం, అనారోగ్యం వంటి సందర్భాల్లోనూ ఈ డబ్బు మీకు భరోసానిస్తుంది.
రుణాలతో జాగ్రత్త..
ఎలాంటి హామీ అవసరం లేని స్వల్పకాలిక రుణాలు మీ పొదుపు శక్తిని హరిస్తాయి. వీటికి చెల్లించే వడ్డీ అధికంగా ఉండటమే దీనికి కారణం. బ్యాంకులు క్రెడిట్ కార్డుల పరిమితిని పెంచడం, ముందుగా ఆమోదించిన రుణాలను అందించడం ద్వారా మీరు డబ్బును ఖర్చు చేసేలా ప్రోత్సహిస్తాయి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలను బాధ్యతాయుతంగా తీసుకోవాలి. లేకపోతే జీతంలో అధిక భాగం వీటి వాయిదాలు చెల్లించేందుకే వెళ్తుంది. మీ జీవన వ్యయాలు, పొదుపు కోసం డబ్బు మిగలదు. పైగా వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే. అదనపు వడ్డీ, జరిమానాలకు దారితీస్తుంది. మీ క్రెడిట్ స్కోరూ దెబ్బతింటుంది. అందువల్ల హామీ లేని రుణాలను వీలైనంత తక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆదాయానికి మంచి అప్పు ఉండటం ఎప్పుడూ మంచిది కాదు. మీ నెలవారీ ఆదాయంలో వాయిదాల చెల్లింపులు 20-35 శాతం లోపే ఉండేలా చూసుకోండి.