తెలంగాణ

telangana

ETV Bharat / business

బీమా పాలసీ తీసుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు మస్ట్​! - what is ulip in telugu

అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేవి బీమా పాలసీలు. అదే సమయంలో స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసే అవకాశమిస్తూ, సంపద వృద్ధికి తోడ్పడేవి యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌). ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు చాలామంది వీటిని ఎంపిక చేసుకుంటారు. మరి, వీటిని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

investing in ulips
investing in ulips

By

Published : Jan 13, 2023, 9:10 AM IST

ఒక వ్యక్తి బీమా, పెట్టుబడి, పన్ను ఆదా అవసరాలను తీర్చే హైబ్రీడ్‌ పథకంగా యులిప్‌లను పేర్కొనవచ్చు. చెల్లించిన ప్రీమియంలో బీమా రక్షణకు మినహాయించిన మొత్తం పోను, మిగతా పాలసీదారుడి ఇష్టానుసారం ఫండ్లలో మదుపు చేస్తాయి. చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80 సీ పరిమితి (రూ.1,50,000) మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5లక్షల లోపు వార్షిక ప్రీమియం ఉన్న పాలసీల వ్యవధి తీరాక వచ్చే మొత్తానికీ సెక్షన్‌ 80సీసీడీ ప్రకారం పన్ను ఉండదు. కేవలం పన్ను ఆదా కోసమే యులిప్‌లను ఎంచుకోవడం ఎప్పుడూ సరికాదు. ఆర్థిక లక్ష్యాల సాధనకూ ఇవి ఉపయోగపడేలా చూసుకోవాలి.

తగిన మొత్తానికి..
బీమా పాలసీదారుడికి ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు నామినీకి పరిహారం లభిస్తుంది. యులిప్‌ తీసుకునేటప్పుడే ఎంత మొత్తానికి పాలసీ తీసుకుంటారన్నది నిర్ణయించుకోవాలి. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. దురదృష్ట సంఘటనలు జరిగినప్పుడు కుటుంబ పెద్ద బాధ్యతను బీమా పాలసీ తీసుకోవాలి. అంటే, కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా అవసరమైన మొత్తానికి పాలసీ తీసుకోవాలి. పాలసీదారుడికి ఎలాంటి ఇబ్బందీ కలగకుంటే.. వ్యవధి తీరిన తర్వాత మోర్టాలిటీ ఛార్జీలను తిరిగి చెల్లించే విధంగా పాలసీని ఎంచుకోవాలి.

అదనపు ఖర్చులు..
పాలసీ నిర్వహణ ఖర్చులు, ప్రీమియం అలెకేషన్‌ ఛార్జీలు, ఫండ్‌ నిర్వహణ రుసుములు, టాపప్‌ ఛార్జీలు, మోర్టాలిటీ, అనుబంధ పాలసీలు, ప్రీమియం మధ్యలో నిలిపివేయడం.. ఇలా యులిప్‌లలో అనేక రకాల రుసుములుంటాయి. బీమా సంస్థలను బట్టి, ఇవి మారుతూ ఉంటాయి. పాలసీ కోసం బీమా సంస్థను సంప్రదించేముందు.. ఈ రుసుముల గురించి పూర్తిగా అర్థం చేసుకోండి. చెల్లించిన ప్రీమియం నుంచి ఎంత మొత్తం వీటికి వెళ్తుంది అన్నది వచ్చే లాభాలనూ ప్రభావితం చేస్తుందని మర్చిపోవద్దు. ఇప్పుడు వస్తున్న కొత్తతరం యులిప్‌లకు సాధారణంగా రుసుములు కాస్త తక్కువగానే ఉంటున్నాయి. యులిప్‌లు దీర్ఘకాలిక పథకాలు. కాబట్టి, వీటిని తీసుకునేటప్పుడు సంస్థ విశ్వసనీయతనూ, క్లెయిం చెల్లింపుల చరిత్రనూ పరిశీలించాలి.

లక్ష్యాల ఆధారంగా..
యులిప్‌లలో పెట్టుబడి పథకాలను ఎంచుకునేటప్పుడు పాలసీదారుడి నష్టభయం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. నష్టభయం భరించలేని వారు డెట్‌ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి రాబడి రావాలి అనుకునే వారు ఈక్విటీలను పరిశీలించవచ్చు. ఈక్విటీలు, డెట్‌ ఫండ్ల మిశ్రమంగా హైబ్రీడ్‌ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు మీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఉన్న పాలసీలను పోల్చిచూసుకోవాలి. ఫండ్ల పనితీరు, గత చరిత్రను చూడాలి.

ABOUT THE AUTHOR

...view details