Stock market news: భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, విలీన ప్రకటనతో భారీగా పుంజుకున్న హెచ్డీఎఫ్సీ ట్విన్స్ షేర్ల లాభాలను సొమ్ము చేసుకోవడం, శుక్రవారం వడ్డీరేట్లపై రిజర్వు బ్యాంకు ప్రకటనకు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించడం ఇందుకు కారణం.
- బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 575 పాయింట్లు కోల్పోయి 59,035 వద్ద స్థిరపడింది. గత రెండు సెషన్లలో కలిపి సెన్సెక్స్ 1001 పాయింట్లు నష్టపోయింది.
- జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 168 పాయింట్లు తగ్గి 17,640 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో కలిపి నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయింది.
- హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, విప్రో, టీసీఎస్, నెస్లే, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా లాభపడ్డాయి.
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయమన్న ఊహాగానాలు జోరందుకోగా.. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. భారతీయ విపణులూ అదే బాటలో సాగాయి.
- ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానంపై శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటన చేయనుంది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న అనుమానాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
- మరోవైపు.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఊహాగానాల నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. డాలరుతో పోల్చితే 22 పైసలు తగ్గి రూ.75.97గా ఉంది.
- అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 1.71శాతం పెరిగి 102.8 డాలర్లకు చేరింది.
- రూపాయి మారకం విలువ 12 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుకు మారకం విలువ రూ.75.96గా ఉంది.