తెలంగాణ

telangana

ETV Bharat / business

కారు ఇన్సూరెన్స్ డీలర్ దగ్గరే​ తీసుకోవాలా? వేరే బెటర్​ ఆప్షన్స్​ ఉన్నాయా?

Should You Buy Your New Car Insurance From Dealer Or Outside In Telugu : మన దేశంలో కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తప్పనిసరి. దీంతో చాలా మంది కారు కొన్న డీలర్ వద్దనే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా కొంటూ ఉంటారు. అయితే డీలర్ వద్ద ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరా? లేదంటే వేరే ఆప్షన్స్​ కూడా ఉన్నాయా? అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Renew Car Insurance Policy
buy Car Insurance From Dealer Or Outside

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:05 AM IST

Should You Buy Your New Car Insurance From Dealer Or Outside : కారు కొనుగోలు చేయడం అనేది చాలా మందికి ఒక కల. ఇందుకోసం కష్టార్జితమైన తమ డబ్బును, జాగ్రత్తగా పొదుపు చేసుకుని తమ కలను నెరవేర్చుకుంటుంటారు. అయితే మన దేశ చట్టాల ప్రకారం కారు కొనుగోలు చేసినప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ లేదా బేసిక్ కారు ఇన్సూరెన్స్​ తీసుకోవడం తప్పనిసరి. ఈ బీమా తీసుకోవడం వల్ల, ఏదైనా ప్రమాదం జరిగితే అవతలిపార్టీ వారికి పరిహారం లభిస్తుంది. అంతేతప్ప డ్యామేజ్ అయిన కారుకుగానీ, యజమానికి గానీ ఎలాంటి పరిహారం లభించదు. కారును కొనుగోలు చేసినప్పుడు సంబంధిత డీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ఆఫర్ చేస్తారు. అయితే డీలర్ వద్ద ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. కానీ కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక, లాభనష్టాలను బేరీజు వేసుకుని ఎక్కడ బీమా కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవాలి.

కారు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?
భారత చట్టాల ప్రకారం వాహన యజమానులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కచ్చితంగా తీసుకోవాలి. సరైన వాహన బీమా లేకుండా వాహనాలు నడిపితే అధికారులు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ బాధ్యతలను మాత్రమే కవర్ చేస్తుంది. వాహనానికి గానీ లేదా దాని యజమానికి లేదా డ్రైవర్​కు జరిగే నష్టాన్ని అది భరించదు. అందుకే సమగ్రమైన కారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీని వల్ల అనుకోని పరిస్థితుల్లో కారుకు నష్టం జరిగితే, మీకు పరిహారం లభిస్తుంది. ముఖ్యంగా మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలు, దొంగతనం, అనుకోని విపత్తుల వల్ల జరిగే నష్టాల నుంచి కూడా బీమా ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే ఈ కారు ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకునే ముందుగా చాలా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

డీలర్ వద్దే ఇన్సూరెన్స్ తీసుకోవాలా?
డీలర్ నుంచి కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. కస్టమర్లకు మంచి సౌలభ్యం, ప్రయోజనాలు అందించడానికే డీలర్లు ఈ సేవలు అందిస్తుంటారు. అయితే కారు డీలర్ వద్ద బీమా కొనుగోలు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటంటే, కస్టమర్లకు బదులు డీలర్లే పాలసీ ప్రాసెస్ మొత్తం పూర్తి చేస్తారు. దీనితో కస్టమర్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కారు ఇన్సూరెన్స్​ను తీసుకోగలుగుతారు. అందువల్ల వాహన యజమానులు కారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఎలాంటి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. డీలర్ల వద్ద బీమా తీసుకుంటే డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. మంచి పాలసీని తీసుకోవడంలో డీలర్లు సహాయపడతారు. బీమా క్లెయిమ్ చేసుకునే సమయంలోనూ డీలర్లు మీకు సహకారం అందిస్తారు.

లోపాలు, పరిమితులు
డీలర్ల వద్ద బీమా కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నా, కొన్ని ముఖ్యమైన లోపాలు, పరిమితులు కూడా ఉంటాయి. వాటిని విస్మరించలేము. డీలర్లు పాలసీపై డిస్కౌంట్లు, మినహాయింపులు అందిస్తున్నప్పటికీ, ప్లాన్ కవరేజీ, ఆఫర్లు పరిమితంగానే ఉంటాయి. చాలా సందర్భాల్లో మీరు కొనుగోలు చేస్తున్న పాలసీకి కనీస కవరేజీ కూడా ఉండదు. అలాగే మీరు డీలర్ వద్ద తీసుకున్న బీమా, మీ అవసరాలకు సరిపోనూవచ్చు లేదా సరిపోకవచ్చు కూడా. సాధారణంగా కారు డీలర్లు బీమా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. దీని వల్ల వాహన యజమానులకు ఇతర కారు ఇన్సూరెన్స్ కవరేజ్ ఆప్షన్లు తెలుసుకునే అవకాశం ఉండదు.

కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
డీలర్లు లేదా బీమా కంపెనీల నుంచి నేరుగా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిస్క్​కు అనుగుణంగా, వాహనాలకు విస్తృతమైన కవరేజీని అందించే సరైన కారు బీమా పాలసీని ఎంచుకోవాలి. అదే విధంగా అధిక క్లెయిమ్ సెటిల్మెంట్​ రేషియో ఉన్న కంపెనీని ఎంచుకోవడం మంచిది. మంచి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బీమా తీసుకుంటే, కస్టమర్ సర్వీస్ అత్యున్నత స్థాయిలో ఉంటుందనే భరోసా లభిస్తుంది.

కవరేజీ, ప్రీమియంల ఆధారంగా ఆన్​లైన్​లో కారు ఇన్సూరెన్స్​లను పోల్చి చూసుకోవడం ఉత్తమం. దీనితో ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ అవసరాలకు సరిపోతుందో తెలుస్తుంది. పాలసీ పరిభాషను, షరతులను కూడా తెలుసుకోవడం మంచిది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ప్లాన్ గురించి తెలుసుకోవడానికి బీమా కంపెనీని సంప్రదించాలి. బీమా కవరేజ్​ను పెంచుకునేందుకు, పాలసీలో యాడ్​-ఆన్స్​ లేదా రైడర్లను జత చేసుకునేందుకు వీలు ఉందో, లేదో చూసుకోవాలి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి కారు ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలి.

మంచి స్కూటర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-10 మోడల్స్ ఇవే!

సూపర్ ఫీచర్లతో 2024 కియా సోనెట్‌ మోడల్​- ధర ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details