SBI Green Deposit Scheme Interest Rates : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఇటీవలే 'గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్'ను ప్రవేశపెట్టింది. ఇది ఒక స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. దీనిపై మంచి వడ్డీ రేట్లు కూడా అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సేకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా
కేంద్ర ప్రభుత్వం 2070 నాటికి కర్బన ఉద్గారాలను (కార్బన్ న్యూట్రాలిటీ) గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఎస్బీఐ 'గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్' (SGRTD)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ డిపాజిట్ స్కీమ్‌లో మదుపు చేయడం ద్వారా ప్రకృతిని కాపాడుకునే నైతిక బాధ్యతను నెరవేర్చినట్లు అవుతుంది. దేశ ఆర్థిక సుస్థిరతకు మీ వంతు కృషి చేసినట్లు అవుతుంది. అదే సమయంలో వడ్డీ రూపంలో మంచి రాబడి సంపాదించడానికి వీలవుతుంది. పైగా మీ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేసినట్లు అవుతుంది.
ఈ స్కీమ్‌లో ఎవరు చేరవచ్చు?
ఈ గ్రీన్ డిపాజిట్ స్కీమ్‌లో భారతీయ పౌరులందరూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ఒకవ్యక్తి యాజమాన్యంలోని సంస్థలు, సొసైటీలు, క్లబ్‌లు, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లతో సహా, ఎన్ఆర్ఐలు కూడా ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
ఎస్బీఐ ఈ గ్రీన్ డిపాజిట్ స్కీమ్‌ను మూడు రకాల కాలవ్యవధుల(టెన్యూర్స్)తో అందిస్తోంది. అవి ఏమిటంటే?
- 1111 రోజుల స్కీమ్ : దీని వడ్డీ రేటు 6.65 శాతం ఉంటుంది.
- 1777 రోజుల స్కీమ్ : దీని వడ్డీ రేటు 6.65 శాతం ఉంటుంది.
- 2222 రోజుల స్కీమ్ : దీని వడ్డీ రేటు 6.40 శాతం ఉంటుంది.
సీనియర్ సిటిజెన్స్‌కు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయా?
సీనియర్ సిటిజెన్స్‌కు, ఎస్బీఐ ఉద్యోగులకు, స్టాఫ్ సీనియర్ సిటిజన్లకు, రిటైల్ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తారు.
అవసరమైతే మధ్యలోనే డబ్బులు తీసుకోవచ్చా?
అత్యవసర సమయాల్లో నిబంధనలను అనుసరించి, ఈ గ్రీన్ డిపాజిట్లలోని సొమ్మును ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు.