తెలంగాణ

telangana

ETV Bharat / business

రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం.. EMIల భారం యథాతథం

కీలక వడ్డీ రేట్లలో ఆర్​బీఐ ఎలాంటి మార్పులూ చేయలేదు. రెపోరేటును 6.5 శాతం వద్దే స్థిరంగా ఉంచింది.

rbi monetary policy june 2023
rbi monetary policy june 2023

By

Published : Jun 8, 2023, 10:17 AM IST

Updated : Jun 8, 2023, 1:40 PM IST

RBI Interest Rate Decision : కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచింది. రెపో రేటును మార్చకుండా.. 6.5 శాతం వద్దే ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. దేశీయంగా పెరిగే డిమాండ్​కు అనుగుణంగా జీడీపీ వృద్ధి ఉంటుందని పేర్కొంది. గతంలో జీడీపీ వృద్ధి రేటును 6.4 శాతంగా అంచనా వేయగా.. దాన్ని స్వల్పంగా పెంచి 6.5 శాతానికి సవరించింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు పెరగడం, మెరుగైన రుణ వితరణ వంటి అంశాలు పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేస్తాయని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలహీన డిమాండ్, భౌగోళిక ఆర్థిక ఉద్రిక్తతలు వృద్ధి రేటుకు ఆటంకం కలిగిస్తాయని చెప్పారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు ఆర్​బీఐ వృద్ధి రేటు అంచనాలు ఇలా..

  • తొలి త్రైమాసికం- 8 శాతం
  • రెండో త్రైమాసికం- 6.5 శాతం
  • మూడో త్రైమాసికం- 6 శాతం
  • నాలుగో త్రైమాసికం- 5.7 శాతం

RBI CPI Inflation : రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని గత కొంతకాలంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ భావనతోనే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయకపోవచ్చని నిపుణులు విశ్లేషించారు. ఆ అంచనాలకు అనుగుణంగానే కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు ఆర్​బీఐ. అయితే సెంట్రల్ బ్యాంక్​కు సంబంధించిన ద్రవ్య విధాన చర్యలు ఆశించిన ఫలితాలను అందిస్తున్నాయని అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.1 శాతానికి తగ్గించినట్లు శక్తికాంత దాస్​ పేర్కొన్నారు. ఇక ఏప్రిల్‌ నెలలో ఆర్​బీఐ వేసిన గణంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారు ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా అంచనా వేసింది. అయితే ఈ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరీలో ఉన్న 6.4 శాతం నుంచి ఏప్రిల్​లో 4.7 శాతానికి పడిపోయింది.

గత ఏప్రిల్​లో జరిగిన సమావేశంలో రెపో రేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. అంతకుముందు.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది.

తిరిగి వస్తున్న 2000 నోట్లు..
ఇప్పటివరకు సుమారు రూ.1.80 లక్షల కోట్ల విలువ గల రూ.2,000 నోట్లు తిరిగి వచ్చాయి. ఇక డిపాజిట్ల రూపంలో దాదాపు 85 శాతం రూ. 2,000 నోట్లు బ్యాంకు ఖాతాల్లోకి వచ్చాయని. కానీ 500 నోట్లను వెనక్కి తీసుకోవడం కానీ రూ.100 నోట్లను ప్రవేశపెట్టడంపై ఆర్​బీఐ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని శక్తికాంత దాస్ అన్నారు.

రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డుల జారీ..
Rupay Prepaid Forex Card : బ్యాంకులు ఇప్పుడు రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని శక్తికాంత దాస్​ తెలిపారు. ఈ కార్డులకు విదేశాల్లో సైతం ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. ఇకపై బ్యాంకులు రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌లు జారీ చేయగలవని.. దీని ద్వారా విదేశాలకు వెళ్లే భారతీయులకు అక్కడ చెల్లింపు చేసేందుకు ఉపయోగపడుతుందని.. త్వరలో విదేశీ అధికార పరిధిలోనూ ఈ రూపే కార్డులు జారీ చేయడానికి అనుమతి ఇవ్వనున్నామని దాస్​ తెలిపారు.

Last Updated : Jun 8, 2023, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details